Bonalu: గోల్కొండలో బోనాల జాతర ప్రారంభం

Bonalu

Bonalu

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస (Bonalu) బోనాల జాతర గోల్కొండ కోటలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయానుసారం కుమ్మర్లు 11 బోనాలతో కూడిన ప్రత్యేక తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ తరఫున లంగర్‌హౌస్ నుంచి బంగారు బోనాన్ని భక్తి శ్రద్ధలతో గోల్కొండ కోటకు తీసుకువచ్చి సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగింది. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం గోల్కొండకు తరలివచ్చారు.

Bonalu festival: Bonalu festival to begin in Hyderabad on July..

ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారు ప్రార్థించారు.

భక్తుల రద్దీ కారణంగా గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో నిండిపోయాయి. కోట వైపు వచ్చే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడటంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చైన్ స్నాచింగ్, పిక్‌పాకెటింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల ఫొటోలతో కూడిన హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు.

Golconda Bonalu 2026 begins with first bonam

ఆషాఢమాస బోనాల (Bonalu) సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవమని, ప్రజల విశ్వాసానికి ఇది ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు. జంట నగరాల్లో జరిగే ఈ వేడుకలు గంగా-జమున తహజీబ్‌కు, లౌకిక స్ఫూర్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు.

భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 3 వేలకుపైగా ఆలయాల్లో ప్రభుత్వం బోనాల జాతర ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దీంతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించబడుతున్నాయి.

Also read: