EPFO: గిగ్ వర్కర్లకు కొత్త PF పథకం

EPFO

EPFO

దేశంలో ఇప్పటివరకు ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికే ఎక్కువగా లభించిన రిటైర్మెంట్ భద్రతను ఇకపై అసంఘటిత రంగ కార్మికులు, (EPFO) గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ (UPF) తరహా కొత్త సామాజిక భద్రతా పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఈ పథకం ద్వారా నెలవారీ స్థిర వేతనం లేని వారు కూడా తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసుకుని భవిష్యత్తుకు రిటైర్మెంట్ భద్రతను ఏర్పరచుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీల్లో అమలవుతున్న ఈపీఎఫ్ విధానం మాదిరిగానే ఇది పనిచేసినా, నిధుల జమ విషయంలో ఎక్కువ వెసులుబాటు ఉండనుంది.

చందాదారులు రోజువారీగా, వారానికి ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి తమకు సాధ్యమైనంత మొత్తాన్ని ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఈ సొమ్ముపై వార్షిక వడ్డీ లభించడంతో పాటు ఉద్యోగులకు లభించే పన్ను రాయితీలే వర్తించే అవకాశం ఉంది. ఏడాదికి రూ.2.5 లక్షల వరకు జమ చేసే మొత్తానికి పన్ను మినహాయింపు ఉండేలా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పథకంలోని మరో ప్రత్యేకత రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్ సొమ్మును ఈపీఎఫ్‌ఓ వద్ద కొనసాగించే అవకాశం కల్పించడం. సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. కానీ కొత్త విధానంలో నిధిని అలాగే ఉంచుకుని వడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉండేలా మార్పులు ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకే ఈపీఎఫ్ చట్టం వర్తిస్తుంది. కొత్త పథకం ద్వారా ఈ పరిధి దాటి ఉన్న కోట్లాది మంది కార్మికులకు కూడా రిటైర్మెంట్ పొదుపు సౌకర్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర కార్మిక శాఖ ముందుకు సాగుతోంది.

ట్యాక్సీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ భాగస్వాములు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్స్ కన్సల్టెంట్లు వంటి వారు ఈ పథకం ద్వారా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించుకునే అవకాశం పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమలుకు అనుగుణంగా ఈ భారీ నెట్‌వర్క్‌ను నిర్వహించేందుకు సరికొత్త ఐటీ వ్యవస్థను రూపొందించే పనులను (EPFO) ప్రారంభించినట్లు సమాచారం.

Also read: