మధ్యప్రాచ్యంలో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఇప్పటివరకు ప్రపంచానికి ప్రధానంగా ముడి చమురు రవాణా మార్గంగా మాత్రమే గుర్తింపు పొందింది. అయితే తాజాగా ఈ ప్రాంతం మరో కీలక కారణంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. సముద్రగర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థకు వెన్నెముకగా మారాయి. ఇప్పుడు ఇవే కేబుల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ప్రమాద సూచనలుగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇరాన్‌కు చెందిన IRGC అనుబంధ మీడియా సంస్థ తస్నిమ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న సముద్రగర్భ కేబుల్స్, క్లౌడ్ డేటా సెంటర్ల వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల కోసం ఈ కేబుల్స్‌పై పూర్తిగా ఆధారపడుతున్నాయి. ఈ దేశాల కమ్యూనికేషన్, బ్యాంకింగ్, డిజిటల్ సేవలు అన్నీ ఈ సముద్రగర్భ కనెక్షన్లపైనే నడుస్తున్నాయి. (Strait of Hormuz) ఇరాన్ వీటిని లక్ష్యంగా చేసుకుంటే భారీ ప్రభావం పడే అవకాశముందని ఆ నివేదిక సూచిస్తోంది.
కేవలం సముద్రంలో ఉన్న కేబుల్స్ మాత్రమే కాకుండా, తీర ప్రాంతాల్లో ఉన్న ల్యాండింగ్ స్టేషన్లు, భారీ డేటా సెంటర్లు కూడా ఇరాన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యూఏఈ, బహ్రెయిన్లలో ఉన్న గ్లోబల్ క్లౌడ్ సేవలు అందించే కేంద్రాలు కీలకంగా ఉన్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి సంస్థల డేటా హబ్‌లు ఈ ప్రాంతాల్లోనే ఉండటంతో, ఏదైనా దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డ్రోన్ దాడుల వార్తలు వెలువడటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.
ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఇరాన్‌కు సంబంధించిన 31 నౌకలను వెనక్కి పంపినట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తూ, ఇరాన్‌తో చర్చలు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ పరిస్థితులు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కనెక్టివిటీ ఎంత ముఖ్యమో ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒకవేళ ఈ సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతింటే, ఇంటర్నెట్ సేవలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, అంతర్జాతీయ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పుడు ఈ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
Also read:
