AP: ఆంధ్రప్రదేశ్‌కు పులులు మధ్యప్రదేశ్‌కు కుక్కలు!

AP

AP

భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకోనుంది. దేశంలోనే అత్యధిక పులుల జనాభా కలిగిన మధ్యప్రదేశ్ రాష్ట్రం, (AP) ఆంధ్రప్రదేశ్‌తో భారీ అంతర్రాష్ట్ర వన్యప్రాణుల మార్పిడి కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడమే కాకుండా పర్యావరణ సమతుల్యతకు కూడా దోహదపడే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన అటవీశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో పులుల సంతతిని బలోపేతం చేయడం కోసం రాయల్ బెంగాల్ టైగర్లతో పాటు భారీ గౌర్లు (భారతీయ అడవి దున్నలు) పంపించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

దీనికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ నుంచి అరుదైన ఆసియా అడవి కుక్కలు, శాస్త్రీయ నామం ‘క్యుయాన్ ఆల్పినస్’ (Cuon alpinus)గా పిలవబడే ధోల్స్‌ను మధ్యప్రదేశ్‌కు తరలించే ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) ఈ జాతిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చింది. అందువల్ల ఈ జాతి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పులులు, గౌర్లను అందించాలని మధ్యప్రదేశ్‌ను కోరిన నేపథ్యంలో సీఎం మోహన్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని పులులు, ఎన్ని గౌర్లు తరలిస్తారు? ఏ టైగర్ రిజర్వుల నుంచి వాటిని పంపిస్తారు? అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్ దేశంలో పులుల సంరక్షణకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. పులుల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాలకు గతంలో కూడా మధ్యప్రదేశ్ పులులను తరలించింది. రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు పులుల మార్పిడికి ఆమోదం తెలిపిన అనుభవం ఈ రాష్ట్రానికి ఉంది.

ఇక (AP) ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ధోల్స్ వల్ల మధ్యప్రదేశ్‌లోని కాన్హా, బాంధవ్‌గఢ్, పెంచ్ వంటి అటవీ ప్రాంతాల్లో జన్యు వైవిధ్యం పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జరగబోయే ఈ వన్యప్రాణుల మార్పిడి కార్యక్రమం దేశంలో వన్యప్రాణుల సంరక్షణకు ఒక కొత్త అధ్యాయంగా నిలవనుందని అటవీశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also read: