కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచిన నేపథ్యంలో, ఇప్పుడు (KiaIndia) కియా ఇండియా కూడా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 1, 2026 నుంచి కియా కంపెనీకి చెందిన అన్ని మోడళ్లపై గరిష్ఠంగా 2 శాతం వరకు ధరల పెంపు అమల్లోకి రానుంది.
కియా ఇండియా(KiaIndia) వెల్లడించిన వివరాల ప్రకారం, ముడి పదార్థాల ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం, సరకు రవాణా మరియు నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఖర్చులను పూర్తిగా వినియోగదారులపై మోపకుండా, కొంతభాగాన్ని కంపెనీ కూడా భరిస్తోందని పేర్కొంది.
ధరల పెంపు కియా సంస్థ విక్రయిస్తున్న అన్ని మోడళ్లకు వర్తించనుంది. అయితే ప్రతి మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల శాతం మారే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో కియా సంస్థ సోనెట్, సిరోస్, సెల్టోస్, కేరెన్స్, కేరెన్స్ క్లావిస్, కార్నివాల్, EV6, EV9 వంటి మోడళ్లను విక్రయిస్తోంది. జూలై 1 నుంచి ఈ వాహనాలన్నింటికీ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
ఆటోమొబైల్ రంగంలో ఇటీవల వరుసగా ధరల పెంపులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల ప్రభావంతో పలు కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించాయి. ఇటీవల మారుతి సుజుకి పలు మోడళ్లపై రూ.30 వేల వరకు ధరలు పెంచగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా కొన్ని వేరియంట్లపై రూ.12,800 వరకు పెంపు చేసింది. ఈ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD కూడా తన వాహనాలపై 3 శాతం వరకు ధరలను పెంచింది. లగ్జరీ సెగ్మెంట్‌లో ఆడి ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా సంస్థలు కూడా తమ కార్ల ధరలను 2 శాతం మేర పెంచాయి. టాటా మోటార్స్ సైతం తన ప్యాసింజర్ వాహనాల ధరలను సగటున 0.5 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కియా కారును కొనుగోలు చేయాలనుకుంటున్న వారు జూలై 1కు ముందు బుకింగ్ లేదా కొనుగోలు పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. లేదంటే కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత అదనపు ఖర్చు భరించాల్సి ఉంటుంది.
ఆటోమొబైల్ మార్కెట్లో కొనసాగుతున్న ధరల పెంపులు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read:
