దేశీయ ఐటీ దిగ్గజం Tata Consultancy Services (టీసీఎస్) (TCS)2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి కాలానికి కంపెనీ ప్రదర్శన అంచనాలకు అనుగుణంగా బలంగా కొనసాగింది. ఈ కాలంలో టీసీఎస్ ఏకీకృత నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 12 శాతానికి పైగా పెరిగి రూ.13,718 కోట్లకు చేరుకుంది.
ఇక సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. త్రైమాసిక ఆదాయం సుమారు 10 శాతం వృద్ధితో రూ.70,698 కోట్లకు చేరినట్లు (TCS) Tata Consultancy Services వెల్లడించింది. ఇది కంపెనీ స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తోంది.

ఈ ఫలితాల నేపథ్యంలో ప్రతి షేర్‌కు రూ.31 ఫైనల్ డివిడెండ్ చెల్లించాలని టీసీఎస్ బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు డైరెక్టర్ల మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పెట్టుబడిదారులకు ఇది శుభవార్తగా మారింది.
ఈ త్రైమాసికంలో కంపెనీ మూడు భారీ డీల్‌లను కుదుర్చుకోవడం గమనార్హం. వీటి మొత్తం కాంట్రాక్ట్ విలువ 12 బిలియన్ డాలర్లకు మించి ఉంది. సంస్థ అనుసరిస్తున్న ‘5-పిల్లర్’ వ్యూహం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు ఈ డీల్‌లు సాధించడంలో కీలక పాత్ర పోషించాయని Tata Consultancy Services తెలిపింది.

త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 5.4 శాతం పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 25.3 శాతానికి చేరుకుని స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ప్రాంతాలవారీగా చూస్తే యూరప్‌లో 6.1 శాతం, యూకేలో 2.4 శాతం వృద్ధి కనిపించింది.
ఈ ఫలితాలపై కంపెనీ సీఈఓ, ఎండీ K Krithivasan స్పందిస్తూ, 12 బిలియన్ డాలర్ల టోటల్ కాంట్రాక్ట్ వ్యాల్యూ నమోదు కావడం గర్వకారణమని తెలిపారు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల్లోనూ కంపెనీ స్థిరమైన వృద్ధిని కొనసాగించడం సానుకూల సంకేతమన్నారు.
అదేవిధంగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ Aarthi Subramanian మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంపెనీకి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏఐ ద్వారా వచ్చిన ఆదాయం 2.3 బిలియన్ డాలర్లను దాటిందని వెల్లడించారు.
మొత్తంగా, Tata Consultancy Services డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, క్లౌడ్, ఏఐ రంగాల్లో బలమైన ప్రగతిని సాధిస్తూ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.