(Gurgaon) లో అద్దె ఇల్లు వెతకడం ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిందో ఒక మాజీ కార్పొరేట్ ఉద్యోగి అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఒక అద్దె ఇల్లు కోసం అతను మొత్తం ₹3.52 లక్షలు ఖర్చు చేసిన విషయం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఇల్లు మారడం అంటే కేవలం అద్దె చెల్లించడమే కాదు, దానికి సంబంధించిన అనేక అదనపు ఖర్చులు కూడా ఉంటాయని ఈ ఉదంతం మరోసారి చూపించింది.

ఆ వ్యక్తి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటి కోసం బ్రోకర్లను సంప్రదించాల్సి రావడంతో బ్రోకరేజ్‌కే ₹45 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది. ఇక వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను చూడటానికి రోజూ తిరగడంతో ఉబర్ ప్రయాణాలకు సుమారు ₹4,200 ఖర్చు అయింది. ఇల్లు వెతికే ప్రక్రియలో బయట ఆహారం తినాల్సి రావడంతో మరో ₹3,100 ఖర్చు చేసినట్లు తెలిపాడు.
ఇది మాత్రమే కాకుండా, బ్రోకర్లు, యజమానులతో మాట్లాడేందుకు ఫోన్ కాల్స్ మరియు మొబైల్ డేటా కోసం ₹400 వరకు ఖర్చయిందని చెప్పాడు. ఒక ఇంటిని ఫైనల్ చేస్తానని ముందుగా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినా, ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో ₹10 వేల నష్టం జరిగినట్లు వెల్లడించాడు.
ఇల్లు వెతికేందుకు ఉద్యోగం నుంచి మూడు రోజుల సెలవులు తీసుకోవాల్సి వచ్చిందని, వాటి వల్ల జీతంలో సుమారు ₹20 వేల నష్టం ఎదురైందని పేర్కొన్నాడు. అయితే అసలు భారీ ఖర్చు సెక్యూరిటీ డిపాజిట్ మరియు మొదటి నెల అద్దె రూపంలో వెళ్లింది. ఇంట్లో చేరకముందే సెక్యూరిటీ డిపాజిట్‌గా ₹1.80 లక్షలు, మొదటి నెల అద్దెగా ₹90 వేల వరకు చెల్లించాల్సి వచ్చిందని తెలిపాడు.
ఈ వివరాలు బయటకు రావడంతో మెట్రో నగరాల్లో అద్దె ఇళ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా (Gurgaon) గుర్గావ్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో అద్దె ధరలు సామాన్య ఉద్యోగులకు భారంగా మారుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు “ఇల్లు అద్దెకు తీసుకోవడం కంటే కొనడం మంచిదేమో” అంటూ వ్యంగ్యంగా స్పందిస్తుండగా, మరికొందరు బ్రోకరేజ్ వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మెట్రో నగరాల్లో జీవన వ్యయం ఎంతగా పెరిగిపోయిందో మరోసారి చర్చకు తెరలేపింది.
Also read:
