బాలీవుడ్ సీనియర్ నటి (RaveenaTandon) రవీనా టాండన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో జరిగిన ‘ఓ మై డాగ్’ సినిమా ప్రీమియర్‌కు ఆమె హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెడ్ కార్పెట్‌పై పాపరాజీలకు ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో సినిమాలో నటించిన కుక్కల్లో ఒకటైన బ్రూనో అకస్మాత్తుగా రవీనా దగ్గరకు వచ్చింది.
వైరల్ వీడియోలో (RaveenaTandon) రవీనా ఆ కుక్కను ఆప్యాయంగా నిమిరేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో బ్రూనో ఆమె చేతికి ఉన్న దారాన్ని తన పళ్లతో పట్టుకుని లాగింది. దీంతో కుక్క రవీనాను కరిచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు గాయాలయ్యాయా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈ ఘటనపై రవీనా టాండన్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి గాయం కాలేదని, తాను పూర్తిగా బాగానే ఉన్నానని తెలిపారు. బ్రూనో తనపై దాడి చేయలేదని, అది తన ఉత్సాహాన్ని, ప్రేమను వ్యక్తపరిచిన విధానం మాత్రమేనని ఆమె వివరించారు.
కుక్క అకస్మాత్తుగా దగ్గరకు వచ్చినప్పటికీ రవీనా కంగారుపడకుండా ప్రశాంతంగా వ్యవహరించారు. కుక్కను గట్టిగా నెట్టకుండా, దాని యజమాని పరిస్థితిని చక్కదిద్దే వరకు సంయమనం పాటించారు. ఆ తర్వాత కూడా ఆమె బ్రూనోను ఆప్యాయంగా నిమురుతూ కనిపించడం విశేషం.
రవీనా టాండన్‌కు జంతువులంటే ఎంతో ప్రేమ. జంతు సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటుంటారు. గతంలో భారీ వర్షాల సమయంలో హైవేపై చిక్కుకున్న ఓ కుక్కను రక్షించి, దానిని జంతు సంక్షేమ సంస్థకు అప్పగించిన విషయాన్ని కూడా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇక ‘ఓ మై డాగ్’ విషయానికి వస్తే.. దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మనుషులు, కుక్కల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని కథాంశంగా తీసుకున్నారు. పంకజ్ త్రిపాఠి, మహి రాయ్, పవన్ మల్హోత్రా, రాజేష్ కుమార్ తదితరులు నటించారు. సినిమాలో కీలక పాత్రలు పోషించిన కుక్కలను కూడా ప్రీమియర్‌కు తీసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
మొత్తానికి.. వైరల్ వీడియోపై వచ్చిన ‘రవీనాను కుక్క కరిచింది’ అనే ప్రచారానికి ఆమె స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. తనకు ఏమీ కాలేదని, బ్రూనో ప్రేమతోనే అలా చేసిందని స్పష్టం చేశారు.
Also read:
