CM Vijay: ఇంద్రకీలాద్రికి సీఎం విజయ్!

CM Vijay

CM Vijay

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను తమిళనాడు ( CM Vijay) ముఖ్యమంత్రి విజయ్ దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయన, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న విజయ్‌ను ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ మర్యాదలతో స్వాగతించారు.

ప్రధాన ఆలయంలోకి వెళ్లిన విజయ్ జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా క్యూలైన్లలో ఉన్న భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేశారు. ఆయన రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

CM Vijay: Tamil Nadu CM Vijay offers prayers at Kanaka..

దర్శనం అనంతరం అనివేటి మండపంలో వేద పండితులు ( CM Vijay) విజయ్‌కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలను బహూకరించారు. దసరా ఉత్సవాల వేళ అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, విజయ్ సంప్రదాయ వస్త్రధారణ పలువురి దృష్టిని ఆకర్షించింది.

అనంతరం విజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు తాగునీటి సరఫరా, నీటి విడుదల పెంపు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

CM Vijay to visit Vijayawada Kanaka Durga Temple LIVE | Tamil Nadu CM Vijay  AP Tour

తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగర తాగునీటి అవసరాలకు ఆంధ్రప్రదేశ్ నీటిని అందిస్తోంది. ఈ ఏడాది 4.08 టీఎంసీల నీటిని ఏపీ సరఫరా చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో నీటి విడుదలను పెంచే అంశంపై తమిళనాడు ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాధ్యాసాధ్యాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఈ భేటీ అనంతరం విజయ్ కృష్ణా నదీ తీరంలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొననున్నట్లు సమాచారం. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నైకి తిరుగు ప్రయాణం కానున్నారు.

మతపరమైన దర్శనంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య తాగునీటి సరఫరా వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యం ఏర్పడింది.