దీపావళి పండుగ వేళ భారీగా మిఠాయిలు విక్రయించి లాభాలు ఆర్జించాలనుకున్న ఓ వ్యాపారికి (HoneyBees) తేనెటీగలు ఊహించని షాక్ ఇచ్చాయి. వేల సంఖ్యలో తేనెటీగలు మిఠాయిలపై వాలడంతో వ్యాపారికి సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఘటన హరియాణాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. హరియాణాలోని భివానీ ప్రాంతానికి చెందిన ఓ మిఠాయి వ్యాపారి దీపావళి సందర్భంగా వివిధ రకాల స్వీట్లను భారీగా తయారు చేయించాడు. వాటిని విక్రయించేందుకు ఫతేబాద్‌లో రోడ్డుపక్కన బహిరంగ స్టాల్ ఏర్పాటు చేశాడు. పండుగ సీజన్ కావడంతో మంచి అమ్మకాలు జరుగుతాయని ఆశించాడు.
అయితే మిఠాయిల నుంచి వెలువడిన వాసనకు సమీపంలోని (HoneyBees) తేనెటీగలు ఒక్కసారిగా ఆకర్షితమయ్యాయి. వేల సంఖ్యలో తేనెటీగలు గుంపులుగా వచ్చి మిఠాయిలపై వాలాయి. వాటిని చూసిన స్టాల్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తేనెటీగలను తరిమేందుకు ప్రయత్నించినప్పటికీ అవి అక్కడి నుంచి వెళ్లకపోగా, మరింత ఎక్కువగా చేరుకున్నాయి.
ఈ ఘటనలో తేనెటీగల దాడి కారణంగా ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు సమాచారం. మిఠాయిలన్నీ తేనెటీగలతో నిండిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు కూడా ఆసక్తి చూపలేదు. దీంతో వ్యాపారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చివరకు కొన్ని మిఠాయిలను స్థానికులకు ఉచితంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని బాధితుడు తెలిపాడు.
ఈ ఘటనతో తనకు దాదాపు రూ.2 లక్షల మేర నష్టం కలిగిందని వ్యాపారి వాపోయాడు. ప్రస్తుతం తేనెటీగలు మిఠాయిలపై గుంపులుగా వాలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read:
- ChinnaJeeyar: వ్యక్తులు శాశ్వతం కాదు.. సేవా లక్ష్యాలు కొనసాగాలి
- KarthikaMasam: నవంబర్ 13న నాగుల చవితి
