Kondagattu: 60 ఏళ్ల తర్వాత అరుదైన చందనోత్సవం..

Kondagattu

Kondagattu

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా (Kondagattu) కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న విశిష్ట చందనోత్సవం, సంప్రోక్షణ మహోత్సవం భక్తుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ పవిత్ర వేడుకల సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే అరుదైన అవకాశం భక్తులకు లభించనుంది.

సాధారణంగా (Kondagattu) కొండగట్టు అంజన్న స్వామివారి మూలవిరాట్‌కు చందనం, సింధూరం అలంకరిస్తారు. అయితే ఈ ప్రత్యేక మహోత్సవంలో భాగంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా మూలవిరాట్‌పై ఉన్న చందనం, సింధూరాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి అసలు రూపాన్ని భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఉత్సవాలు నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. నవంబర్ 20వ తేదీ ఉదయం 9:59 గంటలకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భక్తులకు వరుసగా 41 రోజుల పాటు స్వామివారి మూలవిరాట్ నిజరూప దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన ఉత్సవాన్ని చూసే అవకాశం రావడంతో భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నతనంలో ఈ ఉత్సవాన్ని చూసిన వారు తిరిగి జీవిత చరమాంకంలో మరోసారి దర్శించుకునే అవకాశం లభిస్తుందనే నమ్మకం కూడా భక్తుల్లో ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శన క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, రవాణా, పార్కింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు.

కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్నగా భక్తులచే పూజలందుకుంటున్న స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక వేడుక కొండగట్టు ఆలయ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుంది.

Also read: