హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో గణేష్ మండపాలు భక్తులతో సందడిగా కనిపిస్తుండగా, మరోవైపు నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంతో పండుగ వాతావరణం నెలకొంది.నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎనిమిది ప్రత్యేక (MMTS) రైళ్లను రాత్రివేళల్లో నడపనున్నట్లు ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం, సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, ఫలక్‌నుమా వంటి ప్రధాన స్టేషన్లను కలుపుతూ ఈ సర్వీసులు నడవనున్నాయి.

ప్రత్యేక రైళ్లలో GSH-1 సికింద్రాబాద్ నుంచి రాత్రి 11:50 గంటలకు బయలుదేరి 12:20 గంటలకు నాంపల్లి చేరుతుంది. GHL-2 నాంపల్లి నుంచి 12:30 గంటలకు బయలుదేరి 1:20 గంటలకు లింగంపల్లి చేరుతుంది. GLH-3 లింగంపల్లి నుంచి 1:50 గంటలకు బయలుదేరి 2:40 గంటలకు నాంపల్లి చేరుతుంది.
అదేవిధంగా GHS-4 లింగంపల్లి నుంచి తెల్లవారుజామున 3:30 గంటలకు బయలుదేరి 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. GHL-5 నాంపల్లి నుంచి రాత్రి 11:10 గంటలకు బయలుదేరి 11:55 గంటలకు లింగంపల్లి చేరుతుంది.

GLF-6 లింగంపల్లి నుంచి 12:10 గంటలకు బయలుదేరి 1:50 గంటలకు ఫలక్‌నుమా చేరుతుంది. GFS-7 ఫలక్‌నుమా నుంచి 2:20 గంటలకు బయలుదేరి 3 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. GSH-8 సికింద్రాబాద్ నుంచి ఉదయం 4 గంటలకు బయలుదేరి 4:40 గంటలకు నాంపల్లి చేరుతుంది. ఈ ప్రత్యేక (MMTS) సర్వీసులు మార్గంలోని అన్ని స్టేషన్లలో ఆగనున్నాయి.
భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యం, రాకపోకలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం నిమజ్జనానికి వచ్చే వారికి ఉపయోగపడనుంది.
Also read:
