హైదరాబాద్‌లోని (Osmania) Medical College పరిసరాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి సురేష్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో విద్యార్థులలో ఆగ్రహం వ్యక్తమవుతుండగా, ర్యాగింగ్ ఆరోపణలు ప్రధాన చర్చగా మారాయి.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురేష్, (Osmania) ఉస్మానియా మెడికల్ కాలేజీ సమీపంలో నివసిస్తూ తన చదువును కొనసాగిస్తున్నాడు. ఘటనకు కొద్ది సేపటి ముందు అతడు తన తల్లికి ఫోన్ చేసి, కాలేజీ పరిసరాల్లో ర్యాగింగ్ జరుగుతోందని, తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ అనంతరం కొద్దిసేపటికే సురేష్ తన గదిలో స్పృహ కోల్పోయి పడి ఉన్నట్లు సహ విద్యార్థులు గుర్తించారు.
స్నేహితులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ర్యాగింగ్ కారణంగానే సురేష్ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సురేష్ మృతి వెనుక అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే అతడు తన తల్లికి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా ర్యాగింగ్ కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణం ఉందా? అన్న దానిపై అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక విద్యార్థి మృతితో బాధిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సురేష్ మృతి వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read:
