ఫుట్‌బాల్ ప్రపంచంలో మరోసారి తన మహత్తును చాటుతూ అర్జెంటీనా కెప్టెన్ (LionelMessi) లియోనెల్ మెస్సీ అరుదైన చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఆస్ట్రియాతో జరిగిన గ్రూప్-జే మ్యాచ్‌లో రెండు అద్భుతమైన గోల్స్ నమోదు చేసిన మెస్సీ, జర్మనీ మాజీ దిగ్గజ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
డల్లాస్ వేదికగా జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించింది. ఈ విజయంతో అర్జెంటీనా నాకౌట్ దశకు అర్హత సాధించగా, జట్టు విజయంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అర్జెంటీనాకు పెనాల్టీ అవకాశం లభించింది. అయితే మెస్సీ తీసిన షాట్ గోల్‌పోస్ట్‌ను తప్పించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ ఆ నిరాశ ఎక్కువసేపు నిలవలేదు.
మ్యాచ్ 38వ నిమిషంలో ఫాకుండో మెదినా అందించిన అద్భుతమైన క్రాస్‌ను మెస్సీ (LionelMessi) తన ప్రత్యేకమైన లెఫ్ట్ ఫుట్ ఫినిషింగ్‌తో గోల్‌గా మలిచాడు. ఈ గోల్‌తోనే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొత్త చరిత్రను లిఖించాడు. అనంతరం ఇంజరీ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ ఇచ్చిన పాస్‌ను మరోసారి గోల్‌గా మార్చి అర్జెంటీనా విజయాన్ని ఖరారు చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీలో మెస్సీ ఇప్పటికే ఐదు గోల్స్ నమోదు చేసి గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం ప్రపంచకప్ కెరీర్లో 28 మ్యాచ్‌లు ఆడిన అతను 18 గోల్స్ సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. యాక్టివ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపె 14 గోల్స్‌తో అతనికి దగ్గరగా ఉన్నాడు.
మెస్సీ ఈ మ్యాచ్‌తో మరో అరుదైన ఘనతను కూడా అందుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో జస్ట్ ఫోంటైన్, జైర్జినో మాత్రమే ఈ ఘనత సాధించారు. మరోవైపు ప్రపంచకప్‌లో అత్యధికంగా ఏడు పెనాల్టీలు తీసి వాటిలో మూడు మిస్ చేసిన ఆటగాడిగా కూడా మెస్సీ పేరిట ఒక ప్రత్యేక రికార్డు నమోదైంది.

ఇక అర్జెంటీనా జట్టు ప్రదర్శన విషయానికి వస్తే, కోచ్ లియోనెల్ స్కలోని నేతృత్వంలో జట్టు అటాకింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ అద్భుతంగా రాణిస్తోంది. ఆస్ట్రియా జట్టుకు గోల్ చేసే అవకాశాలను దాదాపు లేకుండా చేసింది. 2022 ప్రపంచకప్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిన తర్వాత అర్జెంటీనా ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా కొనసాగుతోంది. ఆరు విజయాలు, రెండు డ్రాలతో అర్జెంటీనా మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. మెస్సీ ఫామ్ కూడా జట్టుకు మరింత బలం చేకూరుస్తోంది.
Also read:
