ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో జరిగిన ఓ (Wedding) పెళ్లి వేడుక అనూహ్యంగా రద్దు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని ఏర్పాట్లు పూర్తై, బంధుమిత్రుల సమక్షంలో వివాహ కార్యక్రమం ప్రారంభమైన వేళ వధువు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూలమాలలు మార్చుకునే సమయంలో ప్రారంభమైన చిన్న వివాదం చివరకు పెళ్లి ఆగిపోవడానికి కారణమైంది.
అచ్చల్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివారియా గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటావా నుంచి వరుడు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బారాత్‌గా వధువు ఇంటికి చేరుకున్నాడు. వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతుండగా, రాత్రి సమయంలో వధూవరులు పూలమాలలు మార్చుకునేందుకు వేదికపైకి వచ్చారు. ఇదే సమయంలో వధువు సోదరుడు, వరుడు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికే ఆ వివాదం ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది.
ఈ పరిణామాల మధ్య వధువు అందరి ముందూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. తనకు ఈ (Wedding) వివాహం ఇష్టం లేదని, వరుడు చాలా సన్నగా ఉన్నాడని, అతనిని భర్తగా అంగీకరించలేనని స్పష్టం చేసింది. వధువు వ్యాఖ్యలతో అక్కడున్న బంధువులు, అతిథులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వరుడి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆమెను ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా, ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు అత్యవసర సేవలకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. సుమారు మూడు గంటల పాటు రాజీ ప్రయత్నాలు కొనసాగినా, వధువు తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు.
దీంతో చివరికి వివాహ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. తెల్లవారుజామున వరుడు కుటుంబ సభ్యులు పెళ్లి జరగకుండానే తిరిగి ఇటావాకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితం సందడిగా ఉన్న పెళ్లి వేదిక ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ వివాదం కేవలం ఆ క్షణంలో జరిగిన గొడవ వల్ల మాత్రమే కాదని, వధువుకు మొదటి నుంచే ఈ సంబంధంపై ఆసక్తి లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఘటనపై ఇరుపక్షాలు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విస్తృత చర్చకు దారితీసింది.
Also read:
