ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారుల కోసం కీలక మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) సేవలను మరింత సురక్షితంగా, వేగవంతంగా అందించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై కొత్త UAN జనరేట్ చేయడం లేదా ఇప్పటికే ఉన్న UANను యాక్టివేట్ చేయడం కోసం EPFO అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించలేరు. ఈ రెండు సేవలను పూర్తిగా UMANG యాప్‌కు మాత్రమే పరిమితం చేసింది.
డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల అనంతరం వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు (EPFO) తెలిపింది. ముఖ్యంగా ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా UAN యాక్టివేషన్ ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చింది.
UMANG యాప్‌లో “UAN Services Through Face Auth” విభాగంలోకి వెళ్లి “UAN Allotment & Activation” ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం UAN నంబర్, ఆధార్ నంబర్, నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సమ్మతి ఇవ్వాలి. తర్వాత OTP ద్వారా ధృవీకరణ పూర్తయితే, మీ UAN ఇప్పటికే యాక్టివేట్ అయి ఉంటే సంబంధిత సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో ఖాతాదారులు తమ UAN స్థితిని కొన్ని క్షణాల్లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇక EPFO గత ఆర్థిక సంవత్సరం 2025–26కు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది. ఇదే వడ్డీ రేటును వరుసగా మూడో ఏడాది కొనసాగించడం గమనార్హం.
అదే సమయంలో PF ఉపసంహరణ నిబంధనల్లో కూడా కొన్ని కీలక మార్పులు అమలులో ఉన్నాయి. ఉద్యోగంలో కొనసాగుతున్న సమయంలో ఖాతాలోని మొత్తంలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ ఉండేలా నిబంధన ఉంది. ఉద్యోగం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత మాత్రం ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్‌ను నిబంధనల ప్రకారం ఉపసంహరించుకోవచ్చు.
ఈ మార్పులతో EPFO సేవలు మరింత డిజిటల్, వేగవంతం, సురక్షితంగా మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కోట్లాది మంది ఉద్యోగులు ఇకపై UMANG యాప్ ద్వారానే UAN సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు.
Also read:
