శ్రీకృష్ణుడి (Janmashtami) జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరుపుకునే పవిత్రమైన పండుగే శ్రీకృష్ణ జన్మాష్టమి. బాలకృష్ణుడి అల్లరి లీలలు, గోకులంలోని ఆయన బాల్య ఘట్టాలను స్మరించుకుంటూ భక్తులు ఈ పర్వదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు అష్టమి తిథిలో రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. అందుకే జన్మాష్టమి సందర్భంగా అష్టమి తిథితో పాటు రోహిణి నక్షత్రానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.
2026లో జన్మాష్టమి ఎప్పుడు?
2026లో సెప్టెంబర్ 4, శుక్రవారం (Janmashtami) జన్మాష్టమిని ప్రధానంగా జరుపుకోనున్నారు. అయితే కొన్ని వైష్ణవ సంప్రదాయాలు, ఆలయాల్లో సెప్టెంబర్ 5న కూడా కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించే అవకాశం ఉంది. పండుగ తేదీ, ఉపవాస విరమణ సమయాలు ప్రాంతీయ పంచాంగాలు, కుటుంబ ఆచారాల ప్రకారం మారవచ్చు. కాబట్టి భక్తులు తమ ప్రాంతానికి సంబంధించిన పంచాంగాన్ని అనుసరించడం మంచిది.
జన్మాష్టమి పూజా విధానం:
పండుగ రోజున ఇంటిని శుభ్రం చేసి పూజా మందిరాన్ని పూలు, తోరణాలతో అలంకరిస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని చిన్న ఉయ్యాలలో ఉంచి పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించడం ఆనవాయితీ. కొందరు భక్తులు ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు చిన్న పాదముద్రలను వేస్తారు. ఇవి బాలకృష్ణుడు ఇంట్లోకి అడుగుపెట్టినట్లుగా భావిస్తారు.
భక్తులు జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండి శ్రీకృష్ణ నామస్మరణ చేస్తారు. పూజ సమయంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేసి, అనంతరం స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయవచ్చు.ఐదు రకాల సద్దులు, పిండి వంటలు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు కొత్త వస్త్రాలు ధరింపజేసి చందనం, పుష్పాలతో అలంకరించాలి.
శ్రీకృష్ణుడికి తులసి దళం ఎంతో ప్రీతికరమనే భక్తుల విశ్వాసంతో వెన్న, పాలు, పెరుగు, పాలతో తయారు చేసిన తీపి పదార్థాలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. కృష్ణుడి అలంకరణలో ప్రత్యేకమైన నెమలి ఈకను కూడా సమర్పించడం ఆనవాయితీగా ఉంది.
అర్ధరాత్రి పూజకు ప్రత్యేకత:
శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడనే విశ్వాసంతో రాత్రి 12 గంటల సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కృష్ణుడి జన్మోత్సవాన్ని జరుపుతూ హారతి, నైవేద్యం సమర్పించి భజనలు చేస్తారు. “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపిస్తూ శ్రీకృష్ణుడిని స్మరించడం భక్తులు పవిత్రంగా భావిస్తారు.

జన్మాష్టమి సందర్భంగా చిన్నారులకు భోజనం పెట్టడం, తీపి పదార్థాలు పంచడం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా మంచి సంప్రదాయంగా భావిస్తారు. ప్రాంతం, కుటుంబ ఆచారాలను బట్టి పూజా విధానాల్లో మార్పులు ఉండవచ్చు. భక్తి, ప్రేమ, ధర్మం, కరుణను జీవితంలో పాటిస్తూ శ్రీకృష్ణుడిని స్మరించుకోవడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా భావించవచ్చు.
Also read:
- Vratam: వరలక్ష్మీ వ్రతం తేదీ, ముహూర్తం, పూజ విధానం & వ్రత కథ
- VaralakshmiVratam:వరలక్ష్మీ వ్రతం వితంతువులు ఆచరించవచ్చా
