(Hyderabad) హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ “ఛలో లోక్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మరోవైపు, ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ “ఛలో గాంధీ భవన్” కార్యక్రమాన్ని నిర్వహించింది.
కాంగ్రెస్ పిలుపు మేరకు గవర్నర్ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న నేతలు, కార్యకర్తలను (Hyderabad) పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టగా, మంత్రులు, పార్టీ నేతలు వాటిలో పాల్గొన్నారు.
మరోవైపు బీజేపీ నేతలు కూడా భారీ సంఖ్యలో గాంధీ భవన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ భవన్ సమీపంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు, ప్రతినినాదాలు చోటుచేసుకున్నాయి. కొన్ని ఫ్లెక్సీల ధ్వంసం జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతలు నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కాంగ్రెస్ నిరసనలను రాజకీయ ప్రేరేపిత చర్యలుగా విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గాంధీ భవన్, లోక్ భవన్ పరిసరాలతో పాటు కీలక కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also read:
