ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత (Robert Kiyosaki) రాబర్ట్ కియోసాకి మరోసారి పెట్టుబడులు, ఆస్తుల వినియోగంపై ఆసక్తికరమైన సూచనలు చేశారు. డబ్బును కేవలం పొదుపు చేయడం కంటే, అది ఆదాయాన్ని సృష్టించే విధంగా పనిచేయాలని ఆయన ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్, రుణాలు, ఆస్తులు వంటి అంశాలపై తరచూ అభిప్రాయాలు పంచుకునే (Robert Kiyosaki) కియోసాకి, ఈసారి సొంత ఇంటిలోని ఈక్విటీని ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించారు.
తన సోషల్ మీడియా పోస్టులో కియోసాకి క్యాష్-అవుట్ రీఫైనాన్స్ (Cash-Out Refinance) అనే విధానాన్ని ఉదాహరణతో వివరించారు. ఒక వ్యక్తి పదేళ్ల క్రితం 3 లక్షల డాలర్లకు ఇల్లు కొనుగోలు చేశాడని, అందులో 60 వేల డాలర్లు డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రుణంగా తీసుకున్నాడని ఆయన వివరించారు. కాలక్రమేణా ఇంటి విలువ 5 లక్షల డాలర్లకు పెరిగి, రుణ బకాయి 1.8 లక్షల డాలర్లకు తగ్గితే, ఆ ఇంటిలో యజమానికి గణనీయమైన ఈక్విటీ ఏర్పడుతుందని చెప్పారు.
ఈ ఈక్విటీలో కొంత భాగాన్ని రీఫైనాన్స్ ద్వారా నగదుగా మార్చుకుని, ఆ మొత్తాన్ని మరో ఆదాయం వచ్చే ఆస్తిలో పెట్టుబడిగా పెట్టవచ్చని కియోసాకి సూచించారు. ఉదాహరణకు ఆ నగదును డౌన్ పేమెంట్‌గా ఉపయోగించి డ్యూప్లెక్స్ వంటి అద్దె ఆస్తిని కొనుగోలు చేస్తే, అద్దె రూపంలో ప్రతి నెల నగదు ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రుణ చెల్లింపులు, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు పోయిన తర్వాత కూడా అదనపు ఆదాయం మిగిలే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఈ వ్యూహం ప్రతి ఒక్కరికీ లేదా ప్రతి పరిస్థితిలోనూ అనుకూలంగా ఉంటుందని చెప్పలేమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లు, రుణ అర్హత, అద్దె మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత ఆర్థిక స్థితి వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పలువురు నెటిజన్లు ఈ విధానం అన్ని సందర్భాల్లో విజయవంతం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
గమనిక: ఈ సమాచారం రాబర్ట్ కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. ఏదైనా పెట్టుబడి లేదా రుణ నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.
Also read:
