(Medak) మెదక్ జిల్లాలో వీధికుక్కల దాడిలో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాలుడి తల్లిదండ్రులకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మెదక్ (Medak) జిల్లా శివంపేట మండలం రూప్లా తండాకు చెందిన మూడేళ్ల నితున్ పవార్‌పై 2025 జూలై 18న వీధికుక్కల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు. పుట్టినరోజు జరిగిన మరుసటి రోజే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
వీధికుక్కల దాడులను అరికట్టేందుకు మెదక్ జిల్లా పంచాయతీరాజ్ అధికారులు సకాలంలో తగిన నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని కమిషన్ వ్యాఖ్యానించింది. ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఈ విషాద ఘటనను నివారించే అవకాశం ఉండేదని తెలిపింది. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, లోపాలు ఉన్నట్లు కమిషన్ అభిప్రాయపడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ప్రాణాలు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కమిషన్ స్పష్టం చేసింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 18 కింద తనకున్న అధికారాలను వినియోగిస్తూ బాలుడి తల్లిదండ్రులు జర్పుల హోబ్యా, జర్పుల లావణ్యకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది.
కమిషన్ ఉత్తర్వులు అందిన మూడు నెలల్లోగా పరిహారం చెల్లించాలని సూచించింది. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అంతేకాకుండా 2020 నుంచి 2025 వరకు తెలంగాణలో వీధికుక్కల కాట్లు, దాడుల కారణంగా సంభవించిన మరణాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిహారం సహా కమిషన్ చేసిన సిఫారసుల అమలుపై సంబంధిత అధికారులు నివేదిక సమర్పించాలని సూచించింది.
Also read:
