అక్కినేని నాగచైతన్య సతీమణి, నటి (Sobhita) శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతూ విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వెట్టువం’. తమిళ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘మద్రాస్’, ‘కబాలి’, ‘సార్పట్ట పరంపర’, ‘తంగలాన్’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పా రంజిత్.. ఈసారి సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అంశాలతో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

సెప్టెంబర్ 18న ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ పేరుతో విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అనే మూడు కాలాల మధ్య కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రళయం తర్వాత ప్రపంచం ఎలా మారుతుంది? అధికారం కోసం జరిగే పోరాటం, జాతులు–తెగల మధ్య సంఘర్షణ వంటి అంశాలను కథలో చూపించనున్నట్లు గ్లింప్స్ ద్వారా సంకేతాలు ఇచ్చారు.
ప్రాచీన భారతీయ యుద్ధ కళలకు కూడా సినిమాలో ప్రాధాన్యం ఇచ్చారు. తమిళనాడుకు చెందిన అడిమురైతో పాటు పలు యుద్ధ విద్యలను గ్లింప్స్‌లో చూపించారు. ఇందులో ఆర్య ధర్మరాజన్‌గా, షబీర్ కల్లరక్కల్ సెంబియన్‌గా, కలైయరసన్ వీరవర్మన్‌గా, శోభితా ధూళిపాళ రాధిగా కనిపించనున్నారు.

లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్. సాయి దేవానంద్, ఎస్. సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్ నిర్మిస్తున్నారు. ఆర్య, శోభితతో పాటు కలైయరసన్, మిమ్ గోపీ, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కల్, జాన్ విజయ్, సాయి ధీన, ఆనంద్ సామి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూపేష్ షాజీ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక (Sobhita) శోభిత యాక్షన్ సన్నివేశాలపై దర్శకుడు పా రంజిత్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. శోభిత అద్భుతమైన నటి అని, చివరి యాక్షన్ సన్నివేశాలను ఆమె డూప్ లేకుండా స్వయంగా చేసినట్లు తెలిపారు. కెమెరా రిహార్సల్స్ సమయంలో మాత్రమే డూప్ లేదా స్టంట్ డబుల్స్‌ను ఉపయోగించామని, తుది సన్నివేశాల్లో శోభితే నటించారని వెల్లడించారు. పాత్రలో సహజత్వం కోసం ఆమె పూర్తి నిబద్ధతతో పనిచేశారని ప్రశంసించారు.

మరోవైపు యాక్షన్ సీక్వెన్స్‌ల గురించి శోభిత మాట్లాడుతూ.. కొన్ని సన్నివేశాల్లో నైపుణ్యం సాధించాలంటే సాధారణంగా 15 నుంచి 20 ఏళ్ల సాధన అవసరమవుతుందని, అయినప్పటికీ షూటింగ్ సమయంలో ప్రతిరోజూ కష్టపడి వాటిని పూర్తి చేశామని చెప్పారు. దీంతో ‘వెట్టువం’లో శోభిత పాత్ర, ఆమె యాక్షన్ పెర్ఫార్మెన్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Also read:
