దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)కు చెందిన హర్యానాలోని గురుగ్రామ్ సోలార్ సెల్ ప్లాంట్‌లో భారీగా వెండి మాయమైన ఘటన కలకలం రేపుతోంది. సుమారు 31.65 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రంగంలోకి దిగింది. మాయమైన వెండి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.71 లక్షలు ఉంటుందని అంచనా.
సౌర విద్యుత్ కణాల (Photovoltaic Cells) తయారీ, పరిశోధనలో భాగంగా ఈ ప్లాంట్‌లో వెండిని ఉపయోగిస్తుంటారు. ప్లాంట్ రికార్డుల ప్రకారం 2020 నాటికి సుమారు 35.6 కిలోల వెండి స్టాక్‌లో ఉండాలి. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో అధికారులు ప్లాంట్‌ను తనిఖీ చేసి లాకర్లను పరిశీలించగా కేవలం 3.95 కిలోల వెండి మాత్రమే కనిపించింది. దీంతో మిగిలిన 31.65 కిలోల వెండి ఏమైందనే దానిపై యాజమాన్యం సీబీఐకి ఫిర్యాదు చేసింది.
రికార్డులు మాయం.. పర్యవేక్షణపై ప్రశ్నలు
సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో ప్లాంట్‌లో వెండి నిల్వల నిర్వహణపై పలు లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. 2018 వరకు ప్రతి సంవత్సరం వెండి నిల్వలను లెక్కించే విధానం ఉండగా, 2019లో కొత్త ప్లాంట్ హెడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ తనిఖీలు నిలిచిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అదే సమయంలో స్టాక్ రిజిస్టర్లు, ఇన్వెంటరీ నివేదికలు, లాకర్ తాళాల పంపిణీకి సంబంధించిన పత్రాలు కూడా కనిపించలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వెండి వినియోగం, నిల్వలపై పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడం కూడా దర్యాప్తులో కీలక అంశంగా మారింది.
BHEL అధికారులపై CBI కేసు
ఈ వ్యవహారంలో ప్లాంట్ హెడ్, అడిషనల్ జనరల్ మేనేజర్ డాక్టర్ భరత్ కుమార్ పంత్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇన్చార్జ్ ఆశిష్ కుమార్‌తో పాటు మరికొందరు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం. కుట్ర, సాక్ష్యాల మాయం, నమ్మకద్రోహం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.

విచారణ సందర్భంగా సిబ్బంది ఇచ్చిన సమాధానాల్లో పరస్పర విరుద్ధతలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తిగా ఉన్న వెండి నిల్వలు ఎలా మాయమయ్యాయి? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? అనే కోణాల్లో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Also read:
