Charminar: చార్మినార్‌కు వర్షం తర్వాత స్వల్ప నష్టం!

హైదరాబాద్‌ పాతబస్తీకి ప్రతీకగా నిలిచే చారిత్రక (Charminar) చార్మినార్‌కు వర్షం తర్వాత స్వల్ప నష్టం కనిపించింది. సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షం అనంతరం లాడ్‌బజార్‌ వైపు ఉన్న చార్మినార్‌ భాగం నుంచి పూతకు సంబంధించిన కొంత నిర్మాణ భాగం ఊడిపోయి కిందపడింది. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. వర్షం తర్వాత (Charminar) చార్మినార్‌లోని లాడ్‌బజార్‌ వైపు భాగం నుంచి తీగల డిజైన్‌ను పోలిన కొంత భాగం ఒక్కసారిగా కిందపడింది. దీంతో పరిసరాల్లో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Hyderabad: Rains kill 3; damage Charminar - Rediff.com

ఘటనపై సమాచారం అందుకున్న చార్మినార్‌ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని కిందపడిన నిర్మాణ భాగాన్ని సేకరించి భద్రపరిచారు. అనంతరం ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. చార్మినార్‌ ప్రధాన నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా? లేక కేవలం పైపూత లేదా అలంకరణకు సంబంధించిన భాగమే ఊడిపోయిందా? అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

అయితే ఈ భాగం కేవలం వర్షం కారణంగానే ఊడిపోయిందని ఇప్పుడే నిర్ధారించలేమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పూత లేదా అలంకరణ భాగం బలహీనపడటం వల్ల ఈ ఘటన జరిగి ఉండే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

Charminar's northeast minar damaged in Hyderabad rain

ఈ ఘటనపై ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) అధికారులు పరిశీలన చేపట్టారు. ఊడిపోయిన భాగంతో పాటు చార్మినార్‌ పరిసరాలను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. నిర్మాణానికి జరిగిన నష్టం, ఘటనకు గల అసలు కారణం ASI పరిశీలన, నివేదిక అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

1591లో కుతుబ్‌షాహీ పాలకుడు మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా నిర్మించిన చార్మినార్‌ హైదరాబాద్‌ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కట్టడం వర్షం తర్వాత స్వల్పంగా దెబ్బతిన్న ఘటనతో దాని పరిరక్షణపై మరోసారి చర్చ మొదలైంది.

Also read: