వేసవి సీజన్ వచ్చిందంటే మార్కెట్లో (Mango) మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. అయితే ప్రస్తుతం నాసిరకం లేదా రసాయనాలతో పక్వానికి తెచ్చిన మామిడి పండ్లపై ఆందోళనలు పెరుగుతున్నాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమైన పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మంచి మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం చాలా అవసరం.

సహజంగా పండిన మామిడి (Mango) పండ్లు పూర్తిగా ఒకే రంగులో ఉండవు. ఆకుపచ్చ మరియు పసుపు రంగుల మిశ్రమంగా కనిపిస్తాయి. కానీ నాసిరకం లేదా కెమికల్స్‌తో పండించిన పండ్లు పూర్తిగా గాఢమైన పసుపు రంగులో కనిపించే అవకాశముంటుంది. అందుకే పూర్తిగా యెల్లో కలర్‌లో ఉన్న పండ్లను కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు.

మామిడి పండ్లను గుర్తించే మరో ముఖ్యమైన పద్ధతి వాసన. సహజంగా పండిన మామిడి పండ్లకు కాడ దగ్గర తియ్యని సువాసన వస్తుంది. కానీ రసాయనాలతో పండించిన పండ్లకు అలాంటి సహజ వాసన ఉండదు. అందుకే కొనుగోలు చేసే ముందు పండును దగ్గరగా వాసన చూసి గుర్తించాలని సూచిస్తున్నారు.
![]()
బయటకు చాలా మెత్తగా కనిపించి లోపల గట్టిగా ఉండే పండ్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. సహజంగా పండిన మామిడి పండ్లు లోపల బయట సమానంగా మెత్తబడతాయి. కానీ కెమికల్ పద్ధతిలో పండించిన పండ్లు బయట మాత్రమే పండినట్లు కనిపించి లోపల పూర్తిగా గట్టిగానే ఉండే అవకాశం ఉంటుంది.

ఇంకో సాధారణ పరీక్ష స్ట్రిప్ పేపర్ టెస్ట్. రసాయనాల ప్రభావం ఎక్కువగా ఉన్న పండ్లలో స్ట్రిప్ పేపర్ రంగు త్వరగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పరీక్షను సాధారణంగా ఫుడ్ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తారు.

ఇంకా సందేహం ఉంటే మామిడి పండ్లను తినే ముందు కొన్ని గంటల పాటు నీళ్లలో నానబెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉన్న కొంతమేర కెమికల్ అవశేషాలు తొలగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సహజంగా పండిన పండ్లనే ఎంపిక చేసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also read:
