దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్లపై (CBI) సీబీఐ భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపింది. “ఆపరేషన్ చక్ర-VI” పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో దేశంలోని 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. సుమారు 60 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 80కి పైగా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మణిపూర్, హర్యానా రాష్ట్రాల్లో సీబీఐ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా చెన్నై, కోల్‌కతాలో ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన 200కు పైగా సైబర్ మోసాల కేసులతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో నిందితులు షెల్ కంపెనీలు సృష్టించి, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును చలామణి చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ.2 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు (CBI) సీబీఐ వెల్లడించింది. సోదాల సమయంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు పత్రాలు, డిజిటల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీటిని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.
ఈ కేసులో అత్యంత సంచలన విషయం ఏమిటంటే, నిందితులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. నకిలీ కోర్టు ఉత్తర్వులు, దర్యాప్తు సంస్థల పేర్లతో తయారు చేసిన ఫేక్ డాక్యుమెంట్లు, అరెస్టు బెదిరింపులతో బాధితులను భయపెట్టి డబ్బు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ సైబర్ మోసాల నెట్వర్క్ కార్యకలాపాలు కేవలం భారత్‌కే పరిమితం కాలేదని, విదేశాల్లోని ప్రజలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ విచారణను మరింత విస్తరించారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రజలు డిజిటల్ అరెస్ట్, ఫేక్ కోర్టు నోటీసులు, వీడియో కాల్ బెదిరింపులు వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అరెస్టు చేస్తామని, బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తామని బెదిరిస్తే వెంటనే స్పందించకుండా స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also read:
