HighCourt: పరస్పర అంగీకారంతో విడాకులు

HighCourt

HighCourt

పరస్పర అంగీకారంతో వివాహ బంధాన్ని ముగించుకోవాలనుకునే దంపతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (HighCourt) కీలక ఊరటనిచ్చే తీర్పు వెలువరించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి(2) ప్రకారం పేర్కొన్న ఆరు నెలల ‘కూలింగ్ ఆఫ్’ కాలం ప్రతి సందర్భంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన నిబంధన కాదని హైకోర్టు స్పష్టం చేసింది. దంపతుల మధ్య రాజీకి ఎలాంటి అవకాశం లేకపోవడం, అన్ని వివాదాలు పరస్పర అంగీకారంతో పరిష్కారం కావడం వంటి పరిస్థితుల్లో ఈ నిరీక్షణ కాలాన్ని మినహాయించవచ్చని పేర్కొంది.

ప్రకాశం జిల్లాకు చెందిన హర్షవర్ధిని, మనోహర్ దంపతులకు 2022 డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా వారు ఏడాదికిపైగా వేర్వేరుగా జీవిస్తున్నారు. భవిష్యత్తులో కలిసి జీవించే అవకాశం లేదని భావించిన ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. శాశ్వత భరణం, ఆస్తుల పంపకం, పిల్లల సంరక్షణకు సంబంధించిన అంశాలన్నింటినీ ముందుగానే పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుని ఒంగోలు ఫ్యామిలీ కోర్టులో సంయుక్తంగా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.

అయితే చట్టంలో పేర్కొన్న ఆరు నెలల కూలింగ్ ఆఫ్ గడువు పూర్తికాకముందే కేసును విచారించాలని వారు చేసిన అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు (HighCourt) తిరస్కరించింది. రాజీకి అవకాశం ఉండొచ్చనే కారణంతో నిరీక్షణ కాలాన్ని మినహాయించడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దంపతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. కూలింగ్ ఆఫ్ కాలం ఉద్దేశం దంపతులకు మరోసారి ఆలోచించుకునే అవకాశం కల్పించడమేనని, అయితే ఇప్పటికే చాలాకాలంగా విడివిడిగా ఉంటూ అన్ని అంశాలను పరిష్కరించుకున్న జంటల విషయంలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. అలాంటి సందర్భాల్లో ఇది వారి ఇబ్బందులను మరింత పొడిగించడమే అవుతుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘అమర్‌దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్’, ‘అమిత్ కుమార్ వర్సెస్ సుమన్ బేనివాల్’ తీర్పులను హైకోర్టు ప్రస్తావించింది. అవసరమైన అన్ని చట్టపరమైన నిబంధనలు నెరవేరితే ఆరు నెలల నిరీక్షణ కాలాన్ని మినహాయించే అవకాశం ఉందని గుర్తు చేసింది.

దంపతుల మధ్య కుదిరిన ఒప్పందం స్వచ్ఛందంగా జరిగిందని, తిరిగి కలిసే అవకాశం లేదని నిర్ధారించిన హైకోర్టు, ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. కేసును వెంటనే విచారణకు స్వీకరించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒంగోలు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ తీర్పు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే అనేక మంది దంపతులకు చట్టపరంగా కీలక మార్గదర్శకంగా నిలవనుంది.

Also read: