Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్త మిస్టరీ

Bitcoin

Bitcoin

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశలో నడిపించిన డిజిటల్ కరెన్సీ (Bitcoin) వెనుక ఉన్న అసలు సృష్టికర్త ఎవరు? అనే ప్రశ్న గత దాదాపు 17 ఏళ్లుగా మిస్టరీగానే ఉంది. ఈ కరెన్సీని సృష్టించినట్లు చెప్పబడే Satoshi Nakamoto అసలు ఎవరో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే తాజాగా వెలువడిన ఒక సంచలన దర్యాప్తు నివేదిక ఈ రహస్యంపై కొత్త వెలుగులు ప్రసరించింది.

ప్రముఖ జర్నలిస్టులు John Carreyrou మరియు Dylan Freedman దాదాపు ఏడాది పాటు 1.3 లక్షల ఈమెయిళ్లు, కోర్టు రికార్డులను విశ్లేషించారు. వారి దర్యాప్తు ప్రకారం, ఈ మిస్టరీకి కేంద్రబిందువుగా నిలిచింది బ్రిటిష్ క్రిప్టోగ్రాఫర్ Adam Back. ఆయనే Satoshi Nakamoto అయ్యి ఉండొచ్చని వారు బలమైన వాదనలు వినిపిస్తున్నారు.

Image

ఈ దర్యాప్తులో ప్రధానంగా ‘భాషా విశ్లేషణ’ కీలక పాత్ర పోషించింది. సతోషి రచనల్లో కనిపించే కొన్ని ప్రత్యేకమైన శైలులు—ఉదాహరణకు హైఫన్ల వినియోగం, వాక్య నిర్మాణం—అచ్చం Adam Back రాతల్లోనూ కనిపించాయి. AI ఆధారిత విశ్లేషణలో ఈ సామ్యాలు యాదృచ్ఛికం కాదని, అది ఒక ప్రత్యేక ‘లింగ్విస్టిక్ ఫింగర్‌ప్రింట్’గా భావిస్తున్నారు.

ఇక Adam Back గతంలోనే 1997లో ‘హాష్‌క్యాష్’ అనే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇదే టెక్నాలజీ తర్వాత Bitcoin రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఆశ్చర్యకరంగా, బిట్‌కాయిన్ అధికారికంగా 2008లో పరిచయం కావడానికి ముందే, డిజిటల్ కరెన్సీకి అవసరమైన పునాదులను ఆయన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల El Salvadorలో జరిగిన ఒక సమావేశంలో Adam Back ఇచ్చిన సమాధానం కూడా అనుమానాలకు తావిచ్చింది. సతోషి శైలిలోనే ఆయన స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

అదే సమయంలో, 2011లో Satoshi Nakamoto అదృశ్యమైన తర్వాత కొన్ని వారాలకే Adam Back మళ్లీ బిట్‌కాయిన్ చర్చల్లో కనిపించడం కూడా అనుమానాలను బలపరుస్తోంది.

సతోషి వద్ద సుమారు 1.1 మిలియన్ (Bitcoin) బిట్‌కాయిన్లు ఉన్నాయని అంచనా. ఇవి భారీ విలువ కలిగిన ఆస్తి. ఒకవేళ Adam Backనే సతోషి అయితే, ఆ ఆస్తి వివరాలు బయటపెట్టాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.

అయితే ఈ మిస్టరీకి పూర్తి స్థాయి సమాధానం రావాలంటే, Satoshi Nakamotoకి సంబంధించిన ‘ప్రైవేట్ కీ’తో ధృవీకరణ అవసరం. అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.

Also read: