YSJagan: పొగాకు రైతులకు జగన్ మద్దతు!

YSJagan

YSJagan

ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (YSJagan) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. రైతులకు అండగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.

పొగాకు రైతులతో సమావేశమైన జగన్, గోపాలపురం లేదా జంగారెడ్డిగూడెంలో రైతులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుంటానని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్య, కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే కందుకూరులో మరో పర్యటన నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏ పంటకు సంబంధించిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నా తమ పార్టీ అండగా ఉంటుందని (YSJagan) జగన్ భరోసా ఇచ్చారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పొగాకు కొనుగోళ్లపై మాట్లాడుతూ, వేలం ప్రారంభమై దాదాపు 94 రోజులు గడిచినా మొత్తం ఉత్పత్తిలో సుమారు 16.5 శాతం మాత్రమే కొనుగోలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 232 మిలియన్ కిలోలకుపైగా పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు కొనుగోలు పరిమితంగానే జరిగిందని తెలిపారు. సాధారణంగా వంద రోజుల్లో పూర్తయ్యే కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్‌లో కర్ణాటకలో పొగాకు వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లే అవకాశం ఉందని, దాని ప్రభావం రాష్ట్ర రైతులపై పడే ప్రమాదం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో ధరల తగ్గుదలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన జగన్, సమస్యలు పరిష్కారమయ్యే వరకు రైతులకు అండగా నిలుస్తామని పునరుద్ఘాటించారు.

Also read: