ఆకాశాన్ని తిలకించే వారికి ఈ వారం అరుదైన ఖగోళ విందు సిద్ధమవుతోంది. జూలై 30, 31 రాత్రుల్లో సదరన్ డెల్టా అక్వారిడ్స్ (DeltaAquariids) మరియు ఆల్ఫా క్యాప్రికార్నిడ్స్ అనే రెండు ఉల్కాపాతాలు ఒకేసారి గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి. ఈ డబుల్ మెటియోర్ షవర్ కారణంగా రాత్రి ఆకాశంలో మెరుపుల్లా దూసుకెళ్లే ఉల్కలు నక్షత్ర ప్రేమికులను ఆకట్టుకోనున్నాయి.
ప్రతి ఏడాది జూలై మధ్య నుంచి ఆగస్టు వరకు కనిపించే సదరన్ (DeltaAquariids) డెల్టా అక్వారిడ్స్ ఉల్కాపాతం ఈసారి జూలై 30, 31 తేదీల్లో అత్యధిక చురుకుదనాన్ని ప్రదర్శించనుంది. అనుకూల పరిస్థితులు ఉంటే గంటకు సుమారు 25 ఉల్కలు కనిపించే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో జూలై ప్రారంభమైన ఆల్ఫా క్యాప్రికార్నిడ్స్ ఉల్కాపాతం కూడా కొనసాగుతోంది. ఇందులో గంటకు ఐదు వరకు మాత్రమే ఉల్కలు కనిపించినప్పటికీ, అవి అత్యంత ప్రకాశవంతమైన ఫైర్‌బాల్స్‌గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణ.
అయితే ఈసారి పౌర్ణమి తర్వాత చంద్రుడి వెలుతురు ఎక్కువగా ఉండటంతో బలహీనంగా కనిపించే ఉల్కలను గుర్తించడం కొంత కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆల్ఫా క్యాప్రికార్నిడ్స్‌కు చెందిన ప్రకాశవంతమైన ఫైర్‌బాల్స్ మాత్రం చంద్రకాంతిలో కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించాలనుకునే వారు అర్ధరాత్రి తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు ఆకాశాన్ని పరిశీలించడం మంచిది. నగరాల కాంతి కాలుష్యానికి దూరంగా, ఎత్తైన మరియు చీకటి ప్రదేశాన్ని ఎంచుకుంటే ఉల్కాపాతాలను మరింత స్పష్టంగా చూడవచ్చు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ అవసరం లేకుండానే కంటితోనే ఈ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.
అంతరిక్ష శిలలు భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో రాపిడితో మండిపడి వెలుగులు వెదజల్లడం వల్లే ఈ ఉల్కాపాతాలు కనిపిస్తాయి. ప్రకృతి ప్రసాదించే ఈ అరుదైన ఖగోళ విన్యాసాన్ని వీక్షించే అవకాశం సంవత్సరంలో కొద్ది రోజులే లభిస్తుంది. అందుకే ఆకాశ వీక్షణపై ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Also read:
