(Hyderabad) హైదరాబాద్ నగరంలోని ప్రముఖ దేవాలయాలు, ఆశ్రమాలు గురు పూర్ణిమ (వ్యాస పూర్ణిమ) సందర్భంగా భక్తిశ్రద్ధలతో కళకళలాడుతున్నాయి. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గురువుకు అత్యున్నత స్థానం ఉండటంతో, ఈ పవిత్ర దినాన గురువులను స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు, ధ్యాన కార్యక్రమాలు, ప్రవచనాలు మరియు అన్నదాన సేవలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాలు భక్తుల రాకతో సందడిగా మారాయి.

దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాల్లో గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ సేవలు, భజనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అత్తాపూర్, అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయాల్లో హరినామ సంకీర్తనలు, గురు పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహిస్తూ భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తున్నారు. దోమల్‌గూడలోని రామకృష్ణ మఠంలో విశేష పూజలు, ధ్యాన కార్యక్రమాలు, భజనలు నిర్వహించగా, దుండిగల్‌లోని సుందర చైతన్య ఆశ్రమంలో సామూహిక ధ్యానం, స్వామీజీల సందేశాలు భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాయి.

బౌంపల్లి, కండ్లకుంట ప్రాంతంలోని సాయిగీతా ఆశ్రమంలో ప్రశాంత వాతావరణంలో గురు పూజలు, ధ్యాన సత్రాలు జరుగుతుండగా, నందిగామలోని కన్హా శాంతి వనంలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని ఈషా యోగా కేంద్రాల్లో ఉపా యోగా సెషన్లు, గురు పూజలు నిర్వహిస్తున్నారు.

అదేవిధంగా (Hyderabad) అల్వాల్ సూర్యనగర్ కాలనీలోని శివసాయి దేవాలయంలో కూడా గురు పూర్ణిమ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 7:30 గంటలకు దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, సాయిబాబా వారికి మహా అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:00 గంటలకు శ్రీచక్ర నవావర్ణ అర్చన జరగనుంది.
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనుండగా, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమకు తోచినంత విరాళం అందించి అన్నదాన సేవలో భాగస్వాములు కావాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. గురు పూర్ణిమ ఆధ్యాత్మికత, సేవాభావం, గురుభక్తిని చాటిచెప్పే మహోత్సవంగా ప్రతి ఒక్కరూ పాల్గొని దైవానుగ్రహం పొందాలని పిలుపునిస్తున్నారు.
Also read:
