ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వేతన జీవులు ముందుగానే అప్రమత్తం కావాలి. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల పొరపాట్లను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రీఫండ్ ప్రక్రియ కూడా సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది.
ఉద్యోగులకు కంపెనీలు అందించే ఫామ్-16 ఐటీఆర్ దాఖలులో కీలకంగా ఉపయోగపడుతుంది. అయితే ఫామ్-16లో ఉన్న వివరాలనే ఆధారంగా తీసుకుని రిటర్న్ ఫైల్ చేయకుండా, ఆదాయపు పన్ను పోర్టల్‌లో అందుబాటులో ఉండే (AIS) (Annual Information Statement) వివరాలతో సరిపోల్చుకోవాలి. ఫామ్-16, AISలో ఆదాయం లేదా ఇతర లావాదేవీలకు సంబంధించి తేడాలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి సరిచేయడం మంచిది.
అలాగే బ్యాంకు ఖాతాల్లోని సేవింగ్స్‌పై వచ్చే వడ్డీ ఆదాయాన్ని కూడా ఐటీఆర్‌లో సరిగ్గా వెల్లడించాలి. ఆదాయాన్ని దాచిపెడితే భవిష్యత్తులో పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
తమ ఆదాయ వనరులకు అనుగుణంగా సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా జీతం వంటి నిర్దిష్ట ఆదాయం ఉన్న అర్హత కలిగిన వ్యక్తులు ITR-1ను, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల నుంచి మూలధన లాభాలు ఉన్నవారు ITR-2ను ఉపయోగించాల్సి ఉంటుంది.
చివరగా రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. దాఖలు చేసిన రిటర్న్‌ను నిర్దేశిత సమయంలో వెరిఫై చేయకపోతే అది చెల్లుబాటు కాకపోవచ్చు. అందుకే గడువు తేదీ వరకు ఆగకుండా ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడం ఉత్తమం.
Also read:
