(Bengaluru) బెంగళూరులో ఆహార భద్రతా అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన, నిబంధనలకు అనుగుణంగా లేబులింగ్ చేయని ఆహార ఉత్పత్తులు బయటపడ్డాయి. అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్తో పాటు పలు గిడ్డంగులు, ఆహార నిల్వ, సరఫరా కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం రూ.1.38 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అవసరమైన లైసెన్సులు లేకుండా నిల్వ చేసిన సుమారు రూ.4.02 లక్షల విలువైన మందులను కూడా సీజ్ చేశారు.
దేవనహళ్లి, అనేకల్లోని అమెజాన్ కేంద్రాలు, హోస్కోట్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ కేంద్రంతో పాటు (Bengaluru) బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని ఇతర గిడ్డంగుల్లో తనిఖీలు జరిగాయి. దేవనహళ్లి అమెజాన్ కేంద్రంలో రూ.14 లక్షల విలువైన నిబంధనలకు విరుద్ధమైన లేబులింగ్ ఉన్న ఆహార ఉత్పత్తులు, రూ.10 లక్షల విలువైన గడువు ముగిసిన ఉత్పత్తులు గుర్తించారు. అక్కడి నుంచి రూ.2.45 లక్షల విలువైన మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అనేకల్ కేంద్రంలో రూ.19 లక్షల విలువైన లేబులింగ్ లోపాలున్న ఉత్పత్తులు, రూ.13 లక్షల విలువైన గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. హోస్కోట్ ఇన్స్టామార్ట్ కేంద్రంలో ఏకంగా రూ.42 లక్షల విలువైన ఎక్స్పైరీ ఆహార ఉత్పత్తులు గుర్తించారు. అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు తేలడంతో ఆ కేంద్రాన్ని మూసివేశారు.
ఇతర ప్రాంతాల్లో కూడా బిస్కెట్లు, రాగిపిండి, చికెన్ ప్యాటీ, పనీర్, కుకీలు, నట్స్, గుడ్లు, పిండి వంటి పదార్థాలు గుర్తించారు. మొత్తంగా రూ.33 లక్షల విలువైన లేబులింగ్ లోపాలున్న ఉత్పత్తులు, రూ.1.05 కోట్ల విలువైన గడువు ముగిసిన లేదా గడువు సమీపించిన ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మందులతో కలిపి మొత్తం సీజ్ విలువ రూ.1.43 కోట్లకు చేరింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు నోటీసులు జారీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
