(Bihar) బీహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. సిమ్రి బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న రైలులో మంటలు చెలరేగి మూడు బోగీలకు వ్యాపించాయి. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ప్రమాదం సంభవించేలోపే ప్రయాణికులందరూ సురక్షితంగా రైలు నుంచి బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం ప్రకారం, (Bihar) సహర్సా నుంచి సమస్తిపూర్‌కు వెళ్తున్న 63344 ప్యాసింజర్ రైలు తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో సిమ్రి బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్–2పై నిలిచి ఉంది. ఈ సమయంలో ఇంజిన్ ప్రాంతం నుంచి మొదట పొగ రావడం గమనించిన సిబ్బంది, కొద్ది సేపటికే మంటలు ఎగసిపడటాన్ని గుర్తించారు. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి ఇంజిన్‌కు ఆనుకుని ఉన్న మూడు బోగీలను చుట్టుముట్టాయి.
మంటలు ఎగసిపడటంతో రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే రైలు నుంచి దిగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఎగసిపడిన మంటలు స్టేషన్ పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితులు సృష్టించాయి. ఈ ఘటన కారణంగా కొంతసేపు రైల్వే కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. రైల్వే అధికారులు కూడా వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొంతసేపటి ప్రయత్నం తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read:
