Annavaram: అన్నవరం ఆలయంలో ఆసక్తికర ఘటన!

Annavaram

Annavaram

పెళ్లి అనేది జీవితంలో ఒకసారి జరిగే పవిత్రమైన బంధంగా చాలామంది భావిస్తారు. అయితే కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం (Annavaram) అన్నవరం సత్యదేవుని ఆలయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వివాహం చేసుకున్న తొమ్మిది జంటలు మరోసారి పెళ్లి చేసుకున్నారు.

కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోవడంతో పాటు వైవాహిక జీవితం సంతోషంగా సాగాలనే నమ్మకంతో ఈ జంటలు రెండోసారి వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. మొదటి వివాహానికి సరైన ముహూర్తం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయని, మంచి ముహూర్తంలో మరోసారి వివాహం చేసుకుంటే ఇబ్బందులు తొలగుతాయని వారు విశ్వసిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజిస్టు నారాయణమూర్తి సూచనల మేరకు ఈ తొమ్మిది జంటలు (Annavaram) అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సంప్రదాయబద్ధంగా పునర్వివాహ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. వేద మంత్రాల మధ్య మరోసారి మాంగళ్యధారణ చేసుకుని, ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక వ్రతాన్ని కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంటల్లో కొందరికి ఇప్పటికే పిల్లలు ఉన్నారు. మరికొందరి పిల్లలు పెద్దవారయ్యారు. అయినప్పటికీ తమ కుటుంబ శ్రేయస్సు, వైవాహిక బంధం మరింత బలపడాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని పాటించినట్లు వారు తెలిపారు.

ఈ జంటల్లో కొందరు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ప్రాంతానికి చెందినవారిగా సమాచారం. అలాగే విశాఖ జిల్లా ఆనందపురం ప్రాంతం నుంచి ఆరు జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వివాహమైన భార్యాభర్తలు మరోసారి ఆలయంలో మాంగళ్యధారణ చేసుకోవడం భక్తుల్లో ఆసక్తిని కలిగించింది. కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు తొలగుతాయనే విశ్వాసంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జంటలు చెబుతున్నప్పటికీ, ఇవి వారి వ్యక్తిగత నమ్మకాలు మాత్రమే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: