RTC: హైదరాబాద్‌లో త్వరలో 24 గంటలూ బస్సులు!

RTC

RTC

విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో (RTC) ప్రజా రవాణాను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. నగరంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుండటంతో.. అర్ధరాత్రి సమయాల్లోనూ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని ప్రధాన మార్గాల్లో రాత్రిపూట బస్సు సర్వీసులను విస్తరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సెప్టెంబర్ 1 నుంచి నగరంలో ప్రారంభించిన థర్డ్ షిఫ్ట్ బస్ సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి వెల్లడించారు. కేవలం ఏడు రోజుల్లోనే ఈ రాత్రి సర్వీసుల్లో 9,286 మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు తెలిపారు. మరిన్ని కొత్త రూట్లలో రాత్రిపూట బస్సులు నడపాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం 222A కోఠి–పటాన్‌చెరు, 218 అఫ్జల్‌గంజ్–పటాన్‌చెరు, 219 సికింద్రాబాద్–పటాన్‌చెరు, 290U హయత్‌నగర్–సికింద్రాబాద్, 195W బాచుపల్లి–వేవ్‌రాక్, 10H కొండాపూర్–సికింద్రాబాద్ మార్గాల్లో రాత్రి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రూట్లను బట్టి బస్సుల సంఖ్య, ట్రిప్పులు, ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది.

అర్ధరాత్రి వేళల్లోనూ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతోందని మంత్రి చెప్పారు. దశలవారీగా మరిన్ని మార్గాల్లో థర్డ్ షిఫ్ట్ సేవలను పెంచి, హైదరాబాద్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Also read: