Oil: సముద్ర గర్భంలో చమురు

Oil

Oil

దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసేందుకు భారత్ సముద్ర గర్భంలో భారీ అన్వేషణకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) వచ్చే మూడేళ్లలో లోతైన, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించేందుకు సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రణాళికలో భాగంగా దాదాపు ఎనిమిది డీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ బావులను తవ్వే అవకాశం ఉందని OIL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రాథ్ తెలిపారు. అయితే సీస్మిక్ డేటా విశ్లేషణ పూర్తయ్యాకే తుది బావుల సంఖ్యను నిర్ణయించనున్నారు.

ఆయిల్ ఇండియా ప్రస్తుతం అండమాన్, కృష్ణా–గోదావరి (KG), మహానది, కేరళ–కొంకణ్ సముద్ర బేసిన్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. KG, మహానది బేసిన్లలో సంస్థ ఇప్పటికే రెండు చొప్పున బ్లాకులను కలిగి ఉంది. దాదాపు 48 వేల చదరపు కిలోమీటర్ల లోతైన సముద్ర ప్రాంతంలో 2D, 3D సీస్మిక్ సర్వేలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ డేటాను విశ్లేషించడంతో పాటు పాత సీస్మిక్ డేటాను రీ-ప్రాసెస్ చేస్తున్నారు.

అండమాన్ బేసిన్‌లో ఇప్పటికే సహజ వాయువు ఉనికికి సంబంధించిన ప్రోత్సాహకరమైన సంకేతాలు లభించినట్లు (OIL) వెల్లడించింది. శ్రీ విజయపురం-2లో గ్యాస్ ఉనికిని గుర్తించగా, శ్రీ విజయపురం-3లో గ్యాస్ డిస్కవరీ నమోదైనట్లు తెలిపింది. దీంతో అండమాన్ ప్రాంతంలో తదుపరి దశ అన్వేషణకు ప్రాధాన్యం పెరిగింది.

డీప్‌వాటర్ అన్వేషణకు భారీగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’ ద్వారా మద్దతు అందిస్తోంది. 2030–31 వరకు అమల్లో ఉండే ఈ పథకానికి రూ.84,084 కోట్ల కేటాయింపుతో ఆమోదం లభించింది. అర్హత కలిగిన ఖర్చులో 50 శాతం వరకు లేదా ఒక్కో బావికి రూ.675 కోట్లు.. ఏది తక్కువైతే అంత మొత్తాన్ని ప్రభుత్వం అందించే విధానం ఉంది. 60 డీప్‌వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ బావుల కోసం రూ.43,200 కోట్లు కేటాయించారు.

దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం, కొత్త హైడ్రోకార్బన్ నిల్వలను గుర్తించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అయితే అన్వేషణ నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు సీస్మిక్ సర్వేలు, డ్రిల్లింగ్, నిల్వల నిర్ధారణ, ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలన వంటి అనేక దశలు ఉంటాయి. కాబట్టి ఈ పెట్టుబడిని తక్షణ ఉత్పత్తి పెంపుగా కాకుండా భవిష్యత్ ఇంధన వనరుల కోసం చేపడుతున్న దీర్ఘకాలిక అన్వేషణగా చూడాలి.

దేశీయ కార్యకలాపాలతో పాటు రష్యా, వెనిజులా, నైజీరియా, గాబన్, లిబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని చమురు, గ్యాస్ ఆస్తులపైనా OIL దృష్టి కొనసాగిస్తోంది.

Also read: