Chicken: చికెన్ జ్యూసీగా, మెత్తగా రావాలంటే

Chicken

Chicken

చికెన్ వంటకాలు ఇష్టపడే వారికి రుచితో పాటు చికెన్ మెత్తగా, జ్యూసీగా ఉండటం కూడా చాలా ముఖ్యం. అయితే ఇంట్లో (Chicken) చికెన్ వండినప్పుడు కొన్నిసార్లు మాంసం గట్టిగా లేదా నారలాగా మారిపోతుంది. ముఖ్యంగా బోన్‌లెస్ చికెన్‌లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రెస్టారెంట్‌లో తినే చికెన్ మాత్రం మెత్తగా, జ్యూసీగా ఉండటంతో ఇంట్లోనూ అదే టేస్ట్ ఎలా తీసుకురావాలనే సందేహం చాలామందికి ఉంటుంది.

ప్రముఖ చెఫ్ పంకజ్ భదోరియా సూచించిన సింపుల్ టెక్నిక్‌తో చికెన్‌ను ముందుగానే ఎక్కువ గంటలు మారినేట్ చేయాల్సిన అవసరం లేకుండా మెత్తగా చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి చికెన్ ముక్కలను సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చికెన్‌ను బయటకు తీసి, అవసరమైన మసాలాలతో వంట చేసుకోవచ్చు.

ఉప్పు (Chicken) చికెన్‌లోకి రుచిని తీసుకెళ్లడంతో పాటు మాంసంలో తేమ నిలిచేలా చేయడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలోని ఆమ్ల గుణం చికెన్ టెక్స్‌చర్‌ను మెత్తగా చేయడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా బేక్, గ్రిల్ లేదా ఫ్రై చేసే ముందు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెఫ్ సూచిస్తున్నారు.

నిమ్మరసం అందుబాటులో లేకపోతే పెరుగు లేదా మజ్జిగను కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగు లేదా మజ్జిగలో చికెన్‌ను సుమారు 15 నిమిషాలు ఉంచితే మాంసం మెత్తగా ఉండేందుకు సహాయపడుతుంది.

చైనీస్ వంటల్లో ఉపయోగించే ‘వెల్వెటింగ్’ పద్ధతి కూడా మరో మార్గం. ఇందులో కార్న్‌ఫ్లోర్, గుడ్డులోని తెల్లసొన, కొద్దిగా నూనె వంటి పదార్థాలతో చికెన్‌ను కోట్ చేసి కొద్దిసేపు ఉంచుతారు. దీంతో వండేటప్పుడు చికెన్‌లోని తేమ ఎక్కువగా బయటకు పోకుండా ఉంటుంది.

అయితే నిమ్మరసం లేదా వెనిగర్ వంటి ఆమ్ల పదార్థాల్లో చికెన్‌ను ఎక్కువసేపు ఉంచకపోవడం మంచిది. ఎక్కువ సమయం నానబెడితే టెక్స్‌చర్ అతిగా మెత్తబడి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ సమయంలో సింపుల్‌గా చికెన్‌ను జ్యూసీగా చేసుకోవాలనుకునేవారు ఈ పద్ధతిని ప్రయత్నించవచ్చు.

Also read: