సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు ఒక వ్యక్తిపై ఆధారపడకుండా, నిర్దిష్ట లక్ష్యాలతో నిరంతరం కొనసాగాలని (ChinnaJeeyar) చిన్న జీయర్ స్వామి సూచించారు. తాము ఈరోజు ఉన్నా, రేపు లేకపోయినా సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదని స్పష్టం చేశారు.
ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో యతీంద్ర సప్తతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా (ChinnaJeeyar) చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 33వ సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. ముగింపు వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి సేవా కార్యక్రమాల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. వ్యక్తుల ఆకర్షణతో ప్రారంభమయ్యే కార్యక్రమాలు, ఆ వ్యక్తి అందుబాటులో లేకపోతే నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా సేవా కార్యక్రమాలకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
తాము చేపడుతున్న కార్యక్రమాలు, ఇతర సంస్థలను ప్రోత్సహించడం వెనుక కూడా ఇదే ప్రధాన ఉద్దేశమని వివరించారు. వ్యక్తులు శాశ్వతం కాదని, కానీ సమాజానికి మేలు చేసే లక్ష్యాలు మాత్రం చిరకాలం కొనసాగాలని పేర్కొన్నారు. ప్రజలు మంచివని గుర్తించిన కార్యక్రమాలను లక్ష్యాలుగా స్వీకరించి, వాటి సాధన కోసం బృందాలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సేవ అనేది ఒకరి పేరు లేదా వ్యక్తిత్వం చుట్టూ తిరగకుండా, సమాజానికి ఉపయోగపడే లక్ష్యాల ఆధారంగా ముందుకు సాగాలన్న ఆయన సందేశం ఈ వేడుకల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
Also read:
