హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఉన్న బస్టాప్‌లను పునర్వ్యవస్థీకరించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న జిల్లాల బస్సుల స్టాప్‌ను త్వరలో మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇకపై ఈ ప్రాంతంలో జిల్లాల బస్సులు ఆగవు.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతి. రామంతాపూర్ వైపు ఈ కారిడార్‌ను పొడిగించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణ సులభం చేయడానికి బస్టాప్‌ను తాత్కాలికంగా ఉప్పల్ నల్ల చెరువు ప్రాంతానికి మార్చాలని ప్రణాళికలు రూపొందించారు.
ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు వద్ద విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సిటీ బస్సులు ఆగుతున్న బస్టాండ్‌ను పూర్తిగా ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న పాత భవనాలు, బస్ షెల్టర్లు, డ్రైవ్ వేలను తొలగించి కొత్తగా ఆధునిక సదుపాయాలతో బస్టాండ్‌ను నిర్మించనున్నారు. (TGSRTC) ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించారు.
ఈ విషయంపై మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) మరియు ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. రూ.3.20 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.

ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇందులో కొంత భాగం జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుండగా, రామంతాపూర్ వైపు పొడిగింపు పనులను GHMC చేపడుతోంది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ ఎంపికైనప్పటికీ కొన్ని కారణాలతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం వాటిని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ మార్పులు ఉండే అవకాశం ఉంది. వాహనాల రాకపోకలను పరిమిత లేన్లలో అనుమతించే పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల ముందస్తుగా బస్టాప్ మార్పు నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ మార్పులు ప్రయాణికులకు కొంత అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్టాప్ ఉండటం వల్ల మెట్రో నుంచి దిగిన ప్రయాణికులు సులభంగా జిల్లాల బస్సులు ఎక్కగలుగుతున్నారు. ఈ సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకుని అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
Also read:
