Telangana: జ్యోతిష్యంపేరుతో కొత్త సైబర్ మోసాలు

Telangana

Telangana

(Telangana) Police రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో జ్యోతిష్యం, తంత్ర-మంత్రాలు, వశీకరణ సేవల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా Instagram, WhatsApp, Facebook వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది.

ప్రేమ వివాహం, కుటుంబ సమస్యలు, వ్యాపార అభివృద్ధి, శాంతి పూజలు, వశీకరణ, దోష నివారణ వంటి పేర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మొదట్లో చిన్న మొత్తాలు మాత్రమే అడిగి నమ్మకం సంపాదించే ఈ ముఠాలు, తర్వాత దశల వారీగా భారీ మొత్తాలను డిమాండ్ చేస్తున్నాయని హెచ్చరించారు.

సైబర్ మోసగాళ్లు బాధితుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారిని వలలోకి దింపుతున్నారని (Telangana) పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వంటి వ్యక్తిగత బలహీనతలను ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఒకసారి బాధితుడు నమ్మకం పెంచుకున్నాక ప్రత్యేక పూజలు చేయాలి, దోష నివారణ కోసం పెద్ద మొత్తం అవసరం, శత్రువులు శాపాలు పెట్టారు వంటి కథలు చెప్పి రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

డబ్బులు పంపడం ఆపిన వెంటనే లేదా మోసగాళ్లను బ్లాక్ చేసినప్పుడు బెదిరింపులకు దిగుతున్నారని పోలీసులు హెచ్చరించారు. వాట్సాప్ కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులకు హాని చేస్తామని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని భయపెడుతూ బాధితులను మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి గ్యాంగులు ఒకేసారి అనేక నకిలీ అకౌంట్లను నిర్వహిస్తూ, వేర్వేరు బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు చేస్తారని తెలిపారు. అలాగే OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, UPI PIN వంటి గోప్యమైన సమాచారాన్ని అడిగి మరింత మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎవరైనా ఈ తరహా సైబర్ మోసాలకు గురైతే వెంటనేCyber Crime Portal లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా సంప్రదించాలని తెలిపారు.

ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే జ్యోతిష్యం, తంత్రం, వశీకరణ ప్రకటనలను నమ్మవద్దని, అపరిచితులకు డబ్బులు పంపించే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.

Also read: