(GovernmentSchools) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం లక్ష్యంగా కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు ఇంటి పన్ను, నల్లా బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తామని గ్రామ పంచాయతీ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో 62 మంది, ఉన్నత పాఠశాలలో కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పాఠశాలల మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు, విద్యాశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
![]()
ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రోత్సాహకంగా ఇంటి పన్ను, నల్లా బిల్లుల మినహాయింపు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ ప్రత్యేక రాయితీ గ్రామంలోని (GovernmentSchools) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లేదా ఉన్నత పాఠశాలలో పిల్లలను చేర్పించిన ప్రతి కుటుంబానికి వర్తించనుంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుందని సర్పంచ్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా భవిష్యత్తులో గ్రామంలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు గ్రామ పంచాయతీ తెలిపింది. దీంతో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడంలో ఈ చర్య మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఈ ప్రకటన తర్వాత గ్రామంలో సానుకూల స్పందన కనిపిస్తోంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ పథకం గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే 12 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారినట్లు సమాచారం.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడేందుకు గ్రామ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
Also read:
