(Hyderabad) హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేస్తున్న కొత్త వన్ వే ట్రాఫిక్ విధానాన్ని నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్‌లు, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల కారణంగా రహదారి విస్తీర్ణం తగ్గడంతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఈ మార్పులు రాబోయే సుమారు ఒకటిన్నర నుంచి రెండేళ్ల పాటు కొనసాగే నిర్మాణ పనుల సమయంలో వాహనదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు చేపట్టిన ముందస్తు చర్యలుగా (Hyderabad) పోలీసులు చెబుతున్నారు. కొత్త ట్రాఫిక్ విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు సీపీ సజ్జనార్ ఎలాంటి ఆర్భాటం లేకుండా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణించారు.
రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ద జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్ నంబర్ 45 వరకు ఆయన రెండుసార్లు ప్రయాణించారు. మార్గంలో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
మొదటి రోజు లేన్ మార్పుల్లో కొంత గందరగోళం కనిపించినప్పటికీ, మరుసటి రోజుకు పరిస్థితి మెరుగుపడిందని సజ్జనార్ తెలిపారు. వాహనదారులకు స్పష్టమైన సైన్ బోర్డులు, తగినంత ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెచ్-సిటీ పనులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొంటూ, నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
Also read:
