పర్యాటక రంగంలో విశేష సేవలు అందిస్తున్న వారికి (Telangana) తెలంగాణ ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో Telangana Tourism Awards 2026 అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న వ్యక్తులు, సంస్థలు, వ్యాపార సంస్థలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 7, 2026 దరఖాస్తులకు చివరి తేదీ.
పర్యాటక రంగానికి సంబంధించిన రచనలు, ప్రచురణలు, (Telangana) తెలంగాణ టూరిజంపై రూపొందించిన ఉత్తమ చిత్రం, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, టూరిజం గైడ్లు తదితర విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులు, పర్యాటక విద్యాసంస్థలు, వైద్య పర్యాటకం, వినోద పార్కులు, వినూత్న పర్యాటక ప్రాజెక్టులు, సోషల్ మీడియా, యువ పర్యాటక క్లబ్ వంటి విభాగాలు కూడా ఉన్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టుల ఎంపికలో సేవల నాణ్యత, పరిశుభ్రత, వసతులు, పర్యాటకుల సంఖ్య, టర్నోవర్, విదేశీ మారకద్రవ్య ఆదాయం వంటి అంశాలను పరిశీలిస్తారు. పర్యావరణహిత చర్యలు, దివ్యాంగులకు సౌకర్యాలు, పునరుత్పాదక ఇంధనం, వ్యర్థాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
పర్యాటక రచనల విభాగంలో తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురితమైన వ్యాసాలు అర్హత పొందుతాయి. అవసరమైన విభాగాల్లో చార్టర్డ్ అకౌంటెంట్ లేదా చట్టబద్ధ ఆడిటర్ ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక కమిటీ అవసరమైతే సంబంధిత ప్రదేశాలు, సంస్థలను స్వయంగా సందర్శించి పరిశీలించవచ్చు.
పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ప్రతిపాదనలు, ధ్రువపత్రాలు, ఫొటోలు, ఇతర ఆధారాలను జతచేసి సెప్టెంబర్ 7లోగా సమర్పించాలి. దరఖాస్తులను డైరెక్టర్, పర్యాటక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కళా భవన్, రవీంద్ర భారతి, సైఫాబాద్, హైదరాబాద్-500004 చిరునామాకు పంపాలి. మరిన్ని వివరాల కోసం 9440816065, 9440816068 నంబర్లలో సంప్రదించవచ్చు.
Also read:
- TVS Jupiter: రూ.90 వేల లోపు సీక్రెట్ ఫీచర్లు ఇవే!
- Gokulashtami: కృష్ణుడికి ఏ పూలు సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు?
