ఒకే అంతర్జాతీయ బ్రాండ్‌కు చెందిన (SoftDrinks) శీతల పానీయంలో దేశాన్ని బట్టి చక్కెర పరిమాణం భారీగా మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యూకేలో విక్రయించే ఫాంటా క్యాన్‌లో సుమారు 63 కేలరీలు, 3-4 స్పూన్ల చక్కెర ఉండగా.. భారత్‌లో అదే పరిమాణంలోని ఫాంటాలో సుమారు 185 కేలరీలు, 9-10 స్పూన్ల చక్కెర ఉన్నట్లు కథనంలో పేర్కొంది. దీంతో భారత్‌లో విక్రయించే ప్యాకేజ్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్‌పై నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది.
యూకేలో (SoftDrinks) శీతల పానీయాల్లో చక్కెర స్థాయిని బట్టి Sugar Tax అమలు చేస్తున్నారు. 100 మిల్లీలీటర్లలో 5 గ్రాములకు మించి చక్కెర ఉంటే అధిక పన్ను విధించే విధానం ఉంది. ఈ కారణంగా కంపెనీలు పానీయాల్లో చక్కెరను తగ్గించి స్వీటెనర్లను ఉపయోగించేలా ప్రోత్సాహం ఏర్పడింది.
భారత్‌లో మాత్రం శీతల పానీయాలపై విధించే పన్ను చక్కెర పరిమాణానికి నేరుగా అనుసంధానమై ఉండదని కథనం పేర్కొంటోంది. దీంతో చక్కెరను తగ్గించేందుకు కంపెనీలపై అదే స్థాయిలో ఒత్తిడి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఉప్పు, చక్కెర, కొవ్వుల వంటి పదార్థాలపై వినియోగదారులకు స్పష్టమైన హెచ్చరికలు ఎలా ఇవ్వాలనే అంశం కూడా చర్చలో ఉంది. యూరప్‌లో కొన్ని దేశాలు Front-of-Pack (FOPL) హెచ్చరికలకు ప్రాధాన్యం ఇస్తుండగా.. భారత్‌లో లేబులింగ్ నిబంధనలపై మరింత కఠినత అవసరమని నిపుణులు కోరుతున్నారు.
ఇటీవల అధిక చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉన్న ప్యాకేజ్డ్ ఆహారాలపై స్పష్టమైన సమాచారం అందించే విషయంలో FSSAI అనుసరిస్తున్న విధానంపై సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించినట్లు కథనంలో పేర్కొంది. వినియోగదారులకు ఆహారంలోని హానికర పదార్థాలపై స్పష్టమైన సమాచారం అందేలా నియంత్రణ వ్యవస్థ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది.
Also read:
