Movie: రూ.లక్షతో సినిమా.. రూ.20 కోట్ల కలెక్షన్స్!

Movie

Movie

2026లో అత్యంత చెత్త సినిమాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న ఓ చైనీస్ యానిమేషన్ (Movie) మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం రూ.లక్ష బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, ఇటీవల విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’, ‘ఒడిస్సీ’ వంటి భారీ చిత్రాల వసూళ్లను కూడా అధిగమించినట్లు సమాచారం.

చైనాలో విడుదలైన ఈ యానిమేషన్ సినిమా పేరు ‘నియు లై’. చైనీస్ భాషలోని ఈ పేరుకు ‘ది కౌ ఈజ్ కమింగ్’ అనే అర్థం వస్తుంది. సుమారు 86 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని తల్లీకొడుకులు షిన్ యుమెంగ్, సన్ లైఫాంగ్ కలిసి తెరకెక్కించారు. దాదాపు ఐదేళ్లపాటు శ్రమించిన వీరిద్దరే ఈ సినిమాకు రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా కూడా వ్యవహరించారు.

ఒక దూడ, స్కైలార్క్ అనే పక్షి మధ్య జరిగే కలల ప్రయాణం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాకు పెద్దగా ప్రచారం చేయలేదు. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండా, కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయకుండానే ఆగస్టు 5న చైనాలో థియేటర్లలోకి తీసుకొచ్చారు.

(Movie) సినిమా విడుదలైన తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యానిమేషన్ నాణ్యత, కంప్యూటర్ గ్రాఫిక్స్, పాత్రల ఎక్స్‌ప్రెషన్స్, వాయిస్ ఓవర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. కొందరు దీనిని 2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమాగా అభివర్ణించారు. అయితే అదే ట్రోలింగ్ సినిమాకు ఊహించని ప్రచారంగా మారింది.

‘అసలు సినిమా ఎంత చెత్తగా ఉంది?’ అనే ఆసక్తితో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడ సినిమా లోపాలను గుర్తించి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చేయడంతో మరింత వైరల్ అయింది. ఫలితంగా థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగి, సినిమాకు కలెక్షన్లు ఊహించని స్థాయికి చేరుకున్నాయి.

మొదటి పది రోజుల్లో కేవలం రూ.లక్ష స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత భారీగా పుంజుకుని సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలకు భిన్నంగా, విమర్శలే ప్రచారంగా మారి చిన్న సినిమాకు భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

‘నియు లై’ విజయం ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో వైరల్ ట్రోలింగ్ కూడా ఒక సినిమాకు ఉచిత ప్రచారంగా మారవచ్చని మరోసారి నిరూపించిన ఉదాహరణగా నిలుస్తోంది.

Also read: