ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత (Pawan Kalyan) కు ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. వైద్యుల ప్రకారం ఆయనకు రెండు భుజాల్లోనూ తీవ్రమైన రోటేటర్ కఫ్ గాయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం కుడి భుజానికే సర్జరీ నిర్వహించారు. ఈ ఆపరేషన్ దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగింది.
జనసేన వర్గాల సమాచారం ప్రకారం, ఈ గాయం 2016 నుంచే ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన రాజకీయ పర్యటనలు, సభలు, ప్రజలకు నిరంతరం చేతులు ఊపడం, కరచాలనాలు చేయడం వల్ల గాయం మరింత తీవ్రమైందని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ముక్కు సర్జరీ సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజం సమస్య తీవ్రత పూర్తిగా బయటపడింది.
రోటేటర్ కఫ్ అనేది భుజాన్ని స్థిరంగా ఉంచే కండరాలు, టెండన్ల సమూహం. చేతిని పైకి ఎత్తడం, తిప్పడం వంటి కదలికలకు ఇది కీలకం. ఈ కండరాలు చిరిగిపోతే భుజంలో నిరంతర నొప్పి, చేతిని ఎత్తలేకపోవడం, రాత్రివేళల్లో నొప్పి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సర్జరీ సమయంలో వైద్యులు మరో సమస్యను కూడా గుర్తించారు. రోటేటర్ కఫ్ గాయంతో పాటు అవిల్షన్ ఫ్రాక్చర్ కూడా ఉన్నట్లు తేలింది. అంటే టెండన్ లాగబడటం వల్ల ఎముకలోని చిన్న భాగం విరిగి ఊడిపోయిన పరిస్థితి. ఈ కారణంగానే ఆపరేషన్ అనుకున్నదానికంటే క్లిష్టంగా మారిందని వైద్యులు వెల్లడించారు.
ప్రముఖ ఆర్థోపెడిక్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు Dinshaw Pardiwala నేతృత్వంలోని బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం, చేయిని కొన్ని వారాల పాటు స్లింగ్లో ఉంచాలి. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 6 నుంచి 12 వారాల విశ్రాంతి, క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ అవసరం. ఎడమ భుజానికి సంబంధించిన శస్త్రచికిత్సను మరో రెండు నెలల తర్వాత నిర్వహించే అవకాశముందని సమాచారం.
Also read:
