వేసవి వేడిలో చల్లని గాలి కోసం చాలా మంది ఎయిర్ కూలర్‌పై ఆధారపడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో (AirCooler) “కూలర్ సరైన చల్లదనం ఇవ్వడం లేదు” అనే ఫిర్యాదులు వినిపిస్తుంటాయి. నిజానికి కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఎయిర్ కూలర్ పనితీరును గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు.
ఎయిర్ కూలర్‌లో నీటి ఉష్ణోగ్రత కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ నీటి బదులు చల్లని నీరు పోస్తే వెంటనే గాలి చల్లగా అనిపిస్తుంది. మరింత చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ లేదా ఫ్రిజ్‌లో చల్లబెట్టిన నీటిని ఉపయోగించవచ్చు. అయితే ఇది తాత్కాలిక ప్రభావమే కాబట్టి ప్రతి 3-4 గంటలకు నీటిని మార్చడం లేదా ఐస్ వేసుకోవడం మంచిది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఐస్ వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కూలింగ్ ప్యాడ్స్ కూడా కూలర్‌లో ముఖ్యమైన భాగం. ఇవి శుభ్రంగా లేకపోతే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. దుమ్ము, ఫంగస్ పేరుకుపోయి కూలింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే నెలకు కనీసం ఒకసారి ప్యాడ్స్‌ను శుభ్రం చేయాలి. రెండు సంవత్సరాలకు ఒకసారి ప్యాడ్స్ మార్చడం ఉత్తమం. వేసవి ప్రారంభంలోనే కొత్త ప్యాడ్స్ వేస్తే మంచి చల్లదనం పొందవచ్చు.
ఫ్యాన్ బ్లేడ్స్‌పై దుమ్ము పేరుకున్నా గాలి సరైన విధంగా రాదు. కాబట్టి ప్యాడ్స్‌తో పాటు ఫ్యాన్ బ్లేడ్స్‌ను కూడా క్లీన్ చేయడం అవసరం. కూలర్‌ను ఎక్కువ రోజులు వాడకపోతే, అందులోని నీటిని పూర్తిగా తొలగించి శుభ్రం చేసి నిల్వ చేయాలి.
(AirCooler) కూలర్‌ను ఎక్కడ ఉంచుతున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. గది పూర్తిగా మూసివేస్తే కూలర్ పని సరిగా జరగదు. కిటికీ దగ్గర లేదా తలుపు దగ్గర కూలర్ ఉంచితే బయట నుంచి వచ్చే తాజా గాలి లోపలికి వచ్చి చల్లదనాన్ని పెంచుతుంది. క్రాస్ వెంటిలేషన్ ఉండటం వల్ల వేడి గాలి బయటకు వెళ్లి గది త్వరగా చల్లబడుతుంది. గోడకు చాలా దగ్గరగా ఉంచితే గాలి సర్క్యులేషన్ తగ్గిపోతుంది.
గదిలో ఉన్న వాతావరణం కూడా కూలింగ్‌పై ప్రభావం చూపుతుంది. టీవీ, కంప్యూటర్, హీట్ జనరేట్ చేసే లైట్స్ ఎక్కువగా ఆన్‌లో ఉంటే గది వేడి పెరుగుతుంది. అప్పుడు కూలర్ ఎంతసేపు వాడినా చల్లదనం తగ్గుతుంది. కాబట్టి అవసరం లేని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్‌లో ఉంచడం మంచిది.
మొత్తానికి ఎయిర్ కూలర్ ద్వారా మంచి చల్లని గాలి పొందాలంటే నీరు, కూలింగ్ ప్యాడ్స్, ప్లేస్‌మెంట్, వెంటిలేషన్, మెయింటెనెన్స్ అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఈ చిన్న మార్పులు చేస్తే కూలర్ పనితీరు గణనీయంగా మెరుగవుతుంది. తక్కువ ఖర్చుతో ఏసీకి మంచి ప్రత్యామ్నాయంగా ఎయిర్ కూలర్ పనిచేస్తుంది.
Also read:
