వేసవి కాలంలో (AC) Air Conditioner వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ బిల్లులు కూడా భారీగా పెరుగుతున్నాయి. చాలామంది గదిని త్వరగా చల్లబరచడానికి కొత్త ఏసీ కొనాలని భావిస్తుంటారు. అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే, తక్కువ ఖర్చుతో దొరికే Pedestal Fan సహాయంతో కూడా ఏసీ పనితీరును మెరుగుపరచి విద్యుత్ ఖర్చును తగ్గించవచ్చని.

సాధారణంగా (AC) ఏసీ గాలిని చల్లబరచడమే కాకుండా, గది ఉష్ణోగ్రతను సెన్సార్ ద్వారా గుర్తిస్తూ పనిచేస్తుంది. గది చల్లబడిందని భావిస్తే కంప్రెసర్ ఆగిపోతుంది. అయితే చల్లని గాలి బరువుగా ఉండటంతో అది ఎక్కువగా నేల దగ్గరే నిలుస్తుంది. వేడి గాలి పైభాగంలో ఉండిపోతుంది. దీంతో గది మొత్తం సమానంగా చల్లబడకపోయినా ఏసీ సెన్సార్ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇక్కడే Pedestal Fan ఉపయోగపడుతుంది. ఈ ఫ్యాన్ గాలిని నిరంతరం కదిలిస్తూ చల్లని గాలి, వేడి గాలి గదంతా సమంగా వ్యాపించేలా చేస్తుంది. ఫలితంగా గది వేగంగా చల్లబడుతుంది. అలాగే ఏసీ కంప్రెసర్ అవసరమైన సమయం వరకు మాత్రమే పనిచేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.

నిపుణుల ప్రకారం ఫ్యాన్‌ను సరైన స్థానంలో ఉంచడం చాలా ముఖ్యం. ఏసీకి ఎదురుగా గదిలో కొంచెం దూరంగా ఉంచితే చల్లని గాలి గది మూలల వరకు చేరుతుంది. అయితే ఫ్యాన్‌ను నేరుగా ఏసీ కింద పెట్టకూడదని సూచిస్తున్నారు. అలా చేస్తే గాలి ప్రవాహం దెబ్బతిని సెన్సార్ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
మరో ముఖ్యమైన అంశం “విండ్-చిల్ ఎఫెక్ట్”. గాలి కదలిక వల్ల శరీరంపై చెమట త్వరగా ఆవిరై చల్లదనం ఎక్కువగా అనిపిస్తుంది. దీని వల్ల ఏసీని 24 డిగ్రీల బదులుగా 26 డిగ్రీల వద్ద కూడా సౌకర్యంగా ఉపయోగించవచ్చు. ప్రతి ఒక్క డిగ్రీ పెరిగితే విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు, ఏసీని తక్కువ టెంపరేచర్‌లో గంటల తరబడి నడపడం కంటే, కొంచెం ఎక్కువ టెంపరేచర్‌తో పాటు Pedestal Fan ఉపయోగిస్తే తక్కువ సమయంలోనే గది చల్లగా అనిపిస్తుంది. దీంతో విద్యుత్ బిల్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
వేసవిలో చల్లదనం కోసం ఖరీదైన పరికరాలకంటే వాటిని సరిగ్గా ఉపయోగించే విధానం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Also read;
