దేశ రాజధాని (Delhi) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సోనమ్ వాంగ్చుక్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల్లో కాక్రోచ్ జనతా పార్టీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ తదితర సంఘాలు పాల్గొన్నాయి. పోలీసుల చర్యలను ఖండిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే తానే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. నిరసనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని, ఈ నెల 20న నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్కాలర్ నేహా బోరా సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు విద్యార్థి సంఘాలు మానవహారం ఏర్పాటు చేశాయి. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై కొత్త (Delhi) ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పందిస్తూ, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు మరియు వైద్యుల సలహా మేరకే సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కొంతమంది నిరసనకారులు పోలీసు విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు.
ఇక రాజకీయ వర్గాల నుంచి కూడా ఈ ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ ప్రభుత్వం శాంతియుత నిరసన హక్కును అణచివేస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా పోలీసు చర్యలను ఖండిస్తూ నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. నీట్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ఆందోళనలు జాతీయ రాజకీయాల్లో కీలక చర్చకు దారితీశాయి.
Also read:
