Nara Lokesh: లోకేష్ వ్యాఖ్యలపై దుమారం

Nara Lokesh

Nara Lokesh

ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన హైదరాబాద్‌పై వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీశాయి. హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే తనకు అసూయ కలుగుతుందని, రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కట్టుబట్టలతో పంపించారని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

మంగళగిరి రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో దాదాపు ఆరు దశాబ్దాల పాటు కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆ నగరం సాధించిన పురోగతిని చూస్తే అసూయ కలుగుతోందని పేర్కొన్నారు.

అదే సమయంలో 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు తమలో కొత్త పట్టుదలను కలిగించాయని అన్నారు. ఆ అనుభవమే అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి కారణమైందని వివరించారు. గత ఐదేళ్లలో వైసీపీ పాలన కారణంగా అమరావతి నిర్మాణం మందగించిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ ఆ పనులను వేగవంతం చేస్తోందన్నారు.

వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిని అంతర్జాతీయ గుర్తింపు పొందే రాజధానిగా అభివృద్ధి చేస్తామని (Nara Lokesh) లోకేష్ తెలిపారు. యువతకు రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల యువత కూడా భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిన పరిస్థితి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇప్పటికే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. అమరావతిని హైదరాబాద్‌కు మించిన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అయితే “హైదరాబాద్‌ను చూస్తే అసూయ కలుగుతోంది”, “ఆంధ్రులను కట్టుబట్టలతో పంపించారు” అనే వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Also read: